16 March, 2026 | 6:19 PM

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

16-03-2026 12:23 AM

ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, డి.ఎం.అండ్.హెచ్.ఓ సీతారాం, కౌన్సిలర్ వెం కటేశ్వర్లు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ మాట్లాడుతూ.. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.

ఎండ, వాన అని చూడకుండా కష్టపడే కార్మికుల ఆరోగ్యం తమకు ముఖ్యమని, అందుకే ప్రభు త్వం ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరంలో వైద్య బృందం కార్మికులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తగిన సలహాలు అందించారు. అనంతరం కార్మికులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ రామయ్య, బిఆర్‌ఎస్ నాయకుడు సాయిశ్రావణ్, కార్మికులు పాల్గొన్నారు.