27-11-2025 12:08:33 AM
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాం తి): అధికార కాంగ్రెస్‌లో పదవుల పంచాయితీ రచ్చకెక్కింది. మెజార్టీ జిల్లాల్లో సీనియర్లను కాదని, జూనియర్లకు డీసీసీ పదవులు కట్టబెట్టారంటూ అసంతృప్తి బయటపడుతోంది. కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీ పగ్గాలు ఇవ్వడంపైనా పదవులు ఆశించి భంగపడిన వారు అధిష్ఠానంపై మండిపడుతున్నారు. దీంతో కొందరు డీసీసీ అధ్యక్షులను మార్చాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది.
ప్రధానంగా నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతను మార్చాలని ఆ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చగా మారింది. తమను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తికి పదవి ఎలా ఇస్తారని...? సీఎంకు మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంతో కాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది.
నల్లగొండ డీసీసీ అధ్యక్షడిగా నియమితులైన పున్నా కైలాష్‌నేత గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. పార్టీ అధిష్ఠానం మాత్రం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌పై కైలాష్ చేసిన విమర్శలను ఇప్పుడు ముం దుకు తీసుకొస్తున్నారు.
నగరంలోనూ పెదవి విరుపులు
ఇక ఉమ్మడి హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుల నియా మకంపైన మండిపడుతున్నారు. హైదరాబాద్ డీసీసీ పదవి స్థానికంగా కనీసం పరిచయం లేని సైపుల్లాకు ఎలా కట్టబెడుతారని.. పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న ముస్లిం, మైనార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని యూత్ కాంగ్రెస్ నాయకుడు మోత రోహిత్‌కు కట్టబెట్టడంపై మిగతా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు కొనసాగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజేంద్రప్రసాద్‌ను తప్పించి.. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఇవ్వడంపై ఆ జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు మండిప డుతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్ష పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను తప్పించడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. డీసీసీల పంచాయితీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ నెలకొందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఎమ్మెల్యేలకు జోడు పదవులా?
ఎమ్మెల్యేలకు పార్టీ పగ్గాలు అప్పగించి అదనపు భారం వేయడమే కాకుండా.. వారికి జోడు పదవులు కట్టబెట్టడమేం టీ..? అని కొందరు నాయుకులు బాహాటంగానే నిలదీస్తున్నారు. యాదాద్రి భువ నగిరి డీసీసీ అధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యను నియమించడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ పోత్నక్ ప్రమోద్, సీనియర్ నేత తంగళ్లపల్లి రవికుమార్ మండిపడుతున్నారు. నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యే వంశీకృష్ణకే అప్పగించడంపై మిగతా సామాజిక వర్గం భగ్గుమంటోంది.
పెద్దపల్లి జిల్లా బాధ్యతను రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌కు, నిర్మల్ డీసీసీ బాధ్యతలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ఇవ్వ డం కంటే పార్టీలోని సీనియర్లకు బాధ్యతలు అప్పగిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని మార్చి.. లకావత్ ధన్వంతిని నియమించారు. ఈ పదవిని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి , స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన సింగారపు ఇందిరా, మరో నాయకురాలు ఝాన్షీరెడ్డి కూడా ఆశించారు.