24 August, 2026 | 2:29 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

24-08-2026 01:48 AM

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

బెజ్జంకి, ఆగస్టు 23: బెజ్జంకి, గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల పరిధిలో ఎస్‌ఐఆర్-2 ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఆదివారం బెజ్జంకి మండల కేంద్రంలోని పిఎసిఎస్‌ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్-2 ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు, బీఎల్‌ఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఓటర్ల వివరాల పరిశీలనలో ఎలాంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి గ్రామంలో బీఎల్‌ఓలు ప్రజలకు అందుబాటులో ఉండి, ఓటర్లకు ఎస్‌ఐఆర్-2పై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లు కూడా తమ పేర్లు, చిరునామా, ఇతర వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు దక్కేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇన్చార్జి కొండల్ రెడ్డి, బెజ్జంకి ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రమణ రెడ్డి, బెజ్జంకి మండల అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తి రమేష్, గుడిసె ఐలయ్య,నాయకులు రావుల నర్సయ్య, జెల్ల ప్రభాకర్, అక్కరవేణి పోచయ్య, ఇస్కిల్ల ఐలయ్య, యువ నాయకులు శ్రావణ్, శరత్, ప్రశాంత్తో పాటు బీఎల్‌ఓలు పాల్గొన్నారు.