తొమ్మిదేళ్లు.. అయినా దక్కని డబుల్ ఇళ్లు..!
సూర్యాపేట మండలం గాంధీనగర్‌లో 75 ఇళ్ల నిర్మాణం
ఇళ్ళు పూర్తయిన పంపకానికి నోచుకోని వైనం
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఇళ్లు
ఏండ్లుగా ఎదురు చూస్తున్న పేదలు
వెంటనే పంపిణీ చేయాలని అర్హుల వేడుకోలు
సూర్యాపేట రూరల్, జులై 12: మనిషి జీవనానికి కూడు, బట్ట, నీడ అనేవి కనీస అవసరాలు. ప్రభుత్వాలు ఏవైనా వీటి కల్పనకే విశేషమైన కృషి చేస్తుంటాయి. అయితే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించి వారికి అందించాలని లక్ష్యంతో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే అనేకచోట్ల ఇల్లు నిర్మించి కొన్నిచోట్ల పేదలకు అందించింది. కానీ మరికొన్ని చోట్ల పనులు జాప్యం జరిగి అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాటిని అలానే వదిలేసింది.
దీంతో ఏండ్లకు ఏండ్లుగా అవి అలానే ఉండిపోయాయి. పలుచోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ వాటి పంపకం జరగకపోవడంతో వాటికి అమర్చిన తలుపులు కిటికీలు ఇతర వస్తువులు దెబ్బ తినడంతో పాటు ఆ డబుల్ ఇండ్లే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. దీనికి మంచి ఉదాహరణ సూర్యాపేట మండలంలోని గాంధీనగర్ బృహత్ గృహ సముదాయం. నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లుతూ, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పాడుబెడుతూ అధికారులు, పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తొమ్మిదేళ్లుగా మారని తీరు :
గత 2017 మార్చి 3వ తేదీన అప్పటి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా, పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రోడ్లు, భవనముల శాఖ ఆధ్వర్యంలో రూ. 471.75 లక్షల (రూ. 4.71 కోట్లకు పైగా) అంచనా వ్యయంతో 75 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. శంకుస్థాపన జరిగి దాదాపు తొమ్మిదేళ్లు కావస్తున్నా.. నేటికీ ఈ ఇళ్లు అర్హులైన పేదలకు చేరకపోవడం పాలకుల ఉదాసీనతకు పరాకాష్ట.
ప్రజాధనం వృథా.. :
పేదల పన్నుల రూపంలో వసూలు చేసిన రూ. 4.71 కోట్ల భారీ ధనంతో నిర్మించిన ఇళ్లను అలా వదిలేయడం ఫలితంగా వాటికి అమర్చిన తలుపులు, దర్వాజాలు, ఇతర సామాగ్రి దెబ్బతింటున్నాయి. ఇక్కడ ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇంటి గోడలు కూడా పలుచోట్ల దెబ్బతింటున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లను అలానే వదిలేయడంతో ప్రజాధనం వృధా చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు.
పేదలకు తప్పని ఇబ్బందులు :
ఒకపక్క రూకోట్లు వెచ్చించి పూర్తిస్థాయిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు పంచకపోగా.. మరోపక్క సరైన ఇల్లు లేక అనేకమంది పేదలు అష్ట కష్టాలు పడుతున్నారు.ఇంటి అద్దెలు కట్టలేక, సొంత గూడు లేక ఎంతోమంది నిరుపేదలు మురికివాడల్లో ఇబ్బందులు పడుతూ జీవనము ను కొనసాగిస్తున్నా రు. అధికారులు, పాలకులు ఇప్పటికైనా స్పందించి రాజకీయాలకు అతీతంగా ఈ 75 ఇళ్లను వెంటనే అర్హులైన పేద కుటుంబాలకు కేటాయించి వారికి ఏ విధమైన ఇబ్బందులు కలిగించకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
అర్హులకు పంపిణీ చేయాలి..
సరైన ఇండ్లు లేక ఎండకేడుతో వానకు తడుస్తున్న పేదలు అనేకమంది ఉన్నారు. అయితే ఇక్కడ ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఏండ్లు గడుస్తున్నా ఎవరికి ఇవ్వకపోవడంతో అవి దెబ్బతింటున్నాయి. అధికారులు వెంటనే స్పందించి అర్హులను గుర్తించి వారికి పంపిణీ చేయాలి.
బండపల్లి రమేష్, స్థానికుడు






