02-07-2025 01:15:08 AM
మృతులు 36 మంది
సంగారెడ్డి/పటాన్‌చెరు, జూలై 1(విజయక్రాంతి): ‘నా భర్త పేరు ఆస్పత్రిలో చేరిన వారి జాబితాలో లేదు.. చనిపోయిన వారి జాబితాలో కూడా లేదని చెబుతున్నారు. మరి ఎక్కడున్నారు?’ అంటూ ఓ మహిళ రోదిస్తూ వాపోయింది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు సిగాచి ఫ్యాక్టరీ వద్ద, ఆస్పత్రుల వద్ద అటు ఇటు తిరుగుతూ కనిపించిన అధికారులను, పోలీసులను వేడుకుంటున్నారు.
ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. తమవారి ఆచూకీ కోసం వారు పడుతున్న ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య గంద రగోళానికి దారితీస్తోంది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా 36మంది మృతి చెందినట్లు ప్రకటించారు.
అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటించే వరకు అధికారులు అందించిన లెక్కల ప్రకారం 143 మంది కార్మికులు, ఉద్యోగులకుగాను 58 మందిని గుర్తించగా వారిలో కొంత మంది చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు. అలా గే 13 మంది మృతదేహాలను గుర్తించగా, మరో 23 మంది మృతదేహాలను గుర్తించా ల్సి ఉంది.
ఇంకా 16 మంది ఆచూకీ తెలియలేదు. వీరంతా శిథిలాల కిందనే ఉన్నట్లు స్ప ష్టమవుతోంది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రంతా శిథిలాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అనధికారిక లెక్కల ప్రకారం ఆచూకీ తెలియని 16 మంది కూడా చనిపోయే ఉంటారని భావిస్తున్నారు.
మృతదేహాలు కాలిబూడిదయ్యాయా ?
పేలుడు ధాటికి కార్మికుల శరీరాలు మాంసపుముద్దగా మారాయి. గుర్తించలేని విధం గా మారడంతో ఆ మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. మరికొం దరి మృతదేహాల ఆచూరీ లభ్యం కావడం లేదు. వారి శరీరాలు పూర్తిగా కాలిబూడిదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటివర కు అధికారులు 36 మంది మృతి చెందినట్లుగా ప్రకటించినప్పటికీ వాటిలో కూడా 13 మృతదేహాలనే గుర్తించారు. ఇంకా 23 మృత దేహాలు ఎవరివో తెలియాల్సి ఉంది. వాటికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కదిలిస్తే కన్నీటిపర్యంతం!
కాయకష్టం చేసుకుంటూ బతుకు వెళ్లదీయడానికి పరాయి రాష్ట్రాల నుంచి పాశమై లారానికి వచ్చారు.. సిగాచి కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. ఉద్యోగమే మరణశాసనం రాస్తుం దని వారు ఊహించలేదు.. సిగాచి పేలుడు ఘటన పలు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఇప్పటికీ పలువురి ఆచూకీ తెలియ కపోవడంతో వారి కుటుంబీకులు ఫ్యాక్టరీ వద్ద పడిగాపులు కాస్తున్నారు.
క్షతగాత్రులుగా మారి చికిత్స పొందుతున్న ఆస్పత్రు లకు వెళ్లి ఆరా తీసినా.. బయటపడిన మృతదేహాల లిస్టులో తమ వారి పేర్లు లేకపోవ డంతో ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీ వద్దకు మీడియా, అధికారులు ఎవరు వచ్చి నా తమ వారి ఆచూకీ చెప్పండి సారూ.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
భర్త కోసం నలుగురు పిల్లల తల్లి..
ఉదయం షిఫ్ట్‌కు వెళ్లిన ప్రశాంత్ మహాపాత్రో రెండు రోజులైనా ఆచూకీ లేకపోవ డంతో అతడి అత్త కొక్కొ సాహూ, మామ నారాయణ సాహూ విచారణలో ఆరా తీశా రు. భర్త కోసం భార్య సోనాలి మహాపాత్రో పరిశ్రమ వద్దకు వస్తుండగా అదే సమయం లో సీఎం పర్యటన ఉండటంతో పోలీసులు అనుమతించలేదు. సీఎం వెళ్లిపోయిన తర్వాత సోనాలి మహాపాత్రో పిల్లలతో కలిసి పరిశ్రమ వద్దకు ఏడుస్తూ వచ్చింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. తమది ఒడిశా రాష్ట్రమని కొంతకాలంగా పాశమైలారంలో ఉంటున్నామని సోనాలి మహా పాత్రో రోదిస్తూ తెలిపింది.
ఒకే కుటుంబంలో ముగ్గురు..
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల ఆచూకీ లభించలేదు. నిన్నటి నుంచి కనిపించడం లేదని, చికిత్స పొందుతున్న దవాఖానలో తిరిగినా తమవారు కనిపించలేదని ఓ కుటుంబం రోదిస్తూ తెలిపింది. అధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం కూడా లేదని సర్దార్‌సింగ్ అనే వ్యక్తి చెప్పారు. ఆరు సంవత్సరాలుగా పాశమైలారంలో ఉంటూ దిలీప్, దీపక్‌వర్మ, నాగభర్ణ సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికుల మిస్సింగ్ లిస్టులో కూడా వీరి పేర్లు లేవని పేర్కొన్నాడు. కాగా బాధితులు అధికారులను కలిసి తమ వారి ఆచూకీ తెలుసుకునేందుకు యత్నించారు.
ప్రేమతో ఒక్కటై.. జంటగా దూరమై
ప్రేమతో ఆ జంట ఒక్కటైంది..నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆశపడ్డారు..ఆషాడమాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక(రిసెప్షన్) చేసుకుందామనుకున్నారు.. కానీ విధి వక్రీకరించింది.. కలిసి జీవించాల్సిన జంటకు నూరేళ్లు నిండాయి.. ప్రేమలో ఒక్కటై..మరణంలో సైతం ఒక్కటిగానే ప్రాణాలు వదిలారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ భారీ పేలుడులో ఈ ప్రేమ జంట సజీవదహనమైంది. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్‌రెడ్డి, ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమించి రెండు నెలల క్రితం పెళ్లిచేసుకున్నాడు. ఇద్దరు పాశమైలారంలోని సిగాచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
ఎప్పటిలాగే సోమవారం ఉదయం షిప్టుకు విధులకు హాజరయ్యారు. కంపెనీలో జరిగిన పేలుడులో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు శోకసంద్రమయ్యాయి. అయితే వారిద్దరి మృతదేహాలు ఇంకా లభించలేదు. ప్రేమజంట మృతితో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
తక్షణం రూ.లక్ష సాయం.. స్వగ్రామాలకు మృతదేహాల తరలింపు
సగాచి పేలుడులో మృతిచెందిన 36 మందికి గాను గుర్తించిన 13 మృతదేహాలను పోలీసుల పహారా మధ్య స్వగ్రామాలకు తరలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం కోసం రూ. లక్ష అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో కలెక్టర్ ప్రావీణ్య హుటాహుటిన పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి వెళ్లి 13 మంది మృతుల కుటుంబసభ్యులకు లక్ష రూపాయల చెక్కులు అందజేశారు.
స్వగ్రామాలకు తరలించిన మృతదేహాలు..
1. జగన్‌మోహన్(ఒడిశా)
2. మనోజ్ కుమార్(ఒడిశా)
3. శ్రీరమ్య(నూజివీడు)
4. నాగేశ్వర్‌రావు(మంచిర్యాల)
5. రుక్సానా కుతుం(ఇస్నాపూర్)
6.దురై(ఒడిశా)
7. రాంసింగ్ (ఇస్నాపూర్)
8. నిఖిల్‌కుమార్‌రెడ్డి(కడప)
పాశమైలారం ఘటనకు కారణమదేనా?
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలా రం పారిశ్రామిక వాడలో సోమవా రం సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ప్రమాదం రాష్ట్రా న్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 36 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇంతటి మహావిస్పోటనానికి కారణాలు ఏంటని అన్వేషిస్తే చాలానే కనిపిస్తాయి.
ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలకు ప్రధాన కారణం గ్యాస్, బయో ఫ్యూయెల్ ఆధారిత ఫ్యాక్టరీల్లో గ్యాస్ చాంబర్, రియాక్టర్లు, కెమికల్ వేస్టేజ్, విష వాయువులు నిండి రియాక్టర్లు పేలుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. మరికొన్ని సందర్భాల్లో కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా నాసిరకం మెషిన్లు ఏర్పాటు చేసి కార్మికుల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు.
అనుమతులకు భయపడి.. నాసిరకం యంత్రాలు
ఇక సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడుకు ప్రధాన కారణం కాలం చెల్లిన యంత్రాలను ఉపయోగించమే అని తెలుస్తోంది. సాధారణంగా రసాయన పరిశ్రమల్లో స్ప్రేయర్ డయ్యర్లు, బ్లో ఎయిర్ హ్యాండర్లు, రియాక్టర్లు, రసాయన మెషిన్లకు ఐదేళ్ల కాలపరిమితితో అనుమతి ఇస్తారు. కాలం చెల్లినప్పటికీ మరమ్మత్తులతో అవే రియాక్టర్లను కొనసాగించడమో లేక వాటి స్థానంలో నాసిరకం యంత్రాలను ఉపయోగించడమో చేస్తున్నారు.
దీంతో ఎక్కువ ఉష్ణోగ్రతల్లో రసాయనాలను శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్ మెషిన్లు (సీఎఫ్‌ఈ) సరిగ్గా పనిచేయక భారీ పేలుళ్లు చోటుచేసుకుంటు న్నాయి. ఖర్చుతో కూడుకున్న పని కావడంతో యాజమాన్యాలు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక శాఖ వద్ద అనుమతులు తెచ్చుకునేందుకు వెనుకంజ వేస్తున్నాయి.
దీంతో రెండోసారి ఉపయోగించేటప్పుడు నాణ్యత లేని వస్తువులను ఉపయోగించడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్ప్రేయర్ డ్రయ్యర్‌లో ముడి పదార్థాన్ని శుద్ధి చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2) వాడుతుంటారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కూడా మోతాదుకు మించి వాడటంతో పేలుడుకు ఇది ఒక కారణమై ఉండొచ్చనేది మరికొందరి అభిప్రాయం.
నైపుణ్యం లేని వాళ్లతో విధులు
ఇక రసాయన పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్లో అధిక శాతం సరైన నైపుణ్యం లేనివారే. తక్కువ వేతనాలు ఇచ్చే ఉద్దేశంతో నైపుణ్యం లేని కార్మికులను విధుల్లోకి తీసుకోవడం, ప్రమాదకర రసాయనాల గురించి వారికి సరైన అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాగా కార్మికులకు కనీస అవగాహన కల్పించేలా యాజమాన్యాలు శ్రద్ధ తీసుకునేలా ప్రభుత్వం చొరవ చూపాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరముంది. సమీక్షలు నిర్వహించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపాల్సి ఉంటుంది. తరచూ పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులతో తనిఖీలు నిర్వహిం చాలి. రాష్ట్ర ప్రభుత్వం రసాయన పరిశ్రమల యాజమాన్యాలను ప్రతీ ఐదేళ్ల కాలానికి యంత్రాలను, రియాక్టర్లను మార్చేలా ప్రత్యేక రాయితీ కల్పిస్తూ ప్రోత్సహించాల్సిన అవసరముంది.