18 April, 2026 | 12:06 AM

ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ వద్దు

02-07-2025 01:15 AM

ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్

హైదరాబాద్, జులై 1 (విజయక్రాంతి): ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి డ్రైవర్, కండక్టర్ల నియామకాలు రూల్ ఆఫ్ రెగ్యులేషన్ ప్రకారం జరిగేవని, ప్రస్తుతం ఈ విధానాన్ని విస్మరించి ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించడం తగదని ఎంప్లాయీస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎంప్లాయీస్ యూ నియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న మంగళవారం ప్రకటన ద్వారా ఖండించారు.

ఈ అనాలోచిత విధానంతో ఆర్టీసీ నిర్వీర్యం అవుతుందని ఆరోపించారు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఏజెన్సీల నుంచి డ్రైవర్, కండక్టర్ల నియామకాలు చేపట్టడంతో దళారీ వ్యవస్థలు కోకొల్లలుగా పుట్టుకొచ్చి అమాయకపు అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలకు కొలువులను అ మ్ముకుంటున్నారని ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్ విధానంతో సంస్థకు చెడ్డపేరు వస్తుం దని, వెంటనే ప్రభుత్వం, యాజమాన్యం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పైకి మాత్రం ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్తున్నా.. రాష్ర్టవ్యాప్తంగా అన్ని విభాగాలను ఔట్‌సోర్సింగ్ చేసి ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ పరం చేసే కుట్రలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్ నియామకాలను రద్దు చేసి, రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.