15-07-2025 12:24:09 AM
తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ..
ముషీరాబాద్, జూలై 14(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతిలో భాగం అయిన కల్లును రాష్ర్ట ప్రభుత్వం నిషేదించే కుట్రలు చేస్తున్నదని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాలు సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గౌడన్నల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్లు గీత వృత్తిమీద లక్షలాదిమంది ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. రాష్ర్టంలోని కల్లు దుకాణాల మీద ఎక్సుజ్ ఆఫీసర్లు దాడులు చేసి భయభ్రాంతులను చేస్తున్నారని ఆరోపించారు. గత వారం రోజుల నుంచి దాడులు నిర్వహిస్తూ మా జీవనోపాధిని దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక దగ్గర జరిగిన సంఘటనను రాష్ర్టంలోని మొత్తం కల్లు దుకాణాలకు ఆపదించడం సరికాదని అన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సంఘటన పట్ల నిజనిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కూకట్పల్లిలో జరిగిన కల్తీ కల్లు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లిక్కర్ అమ్మకాలు పెంచేందుకు కల్లు గీత వృత్తి పట్ల దుష్ర్పచారం తగదని పేర్కొన్నారు. కమిటీ నాయకులు అయిలు వెంకన్న గౌడ్, దుర్గయ్య గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, వంగ సదానందం గౌడ్, సోకూరి దుర్గా గౌడ్, బైరు శేఖర్, గోదా వెంకటేష్ గౌడ్, కొత్త నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.