నడిగడ్డలో నకిలీ ఎరువుల దందా..!
- చిన్నంబావి ఘటనతో జిల్లాలో కలకలం..
- అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రైతుల డిమాండ్
అలంపూర్, జూలై 21: సాగు సీజన్ ప్రారంభమైన వేళ నడిగడ్డ రైతులను నకిలీ ఎరువులు, అధిక ధరల విక్రయాలు కలవరపెడుతున్నాయి. వర్షాల ఆలస్యంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇప్పుడు ఎరువుల అక్రమాలు మరో తలనొప్పిగా మారాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ఎరువుల వ్యాపారంపై అనుమానాలకు తావిచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది.
చిన్నంబావి ఘటన ఏంటి..?
ఐఎఫ్‌ఎఫ్సీఓ డీఏపీ ఎరువులను నిర్ణయించిన ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో లైసెన్సు, విక్రయ బిల్లులు లేకుండా సుమారు 200 బస్తాలు విక్రయించినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న ఎరువుల నమూనాలను నాణ్యత పరీక్షల కోసం పంపగా, నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
ఒక్క ఘటనేనా..?
ఈ ఘటనతో నడిగడ్డలో ఎరువుల విక్రయాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతులకు బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు, నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూళ్లు, ఇతర ప్రాంతాలకు అక్రమ సరఫరా వంటి అంశాలపై గతంలోనూ ఆరోపణలు వినిపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పటిష్ట తనిఖీలు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఇలాంటి అక్రమాలు మరెక్కడైనా జరుగుతున్నాయా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
రైతుల డిమాండ్ ఇదే ...
జిల్లాలోని ప్రతి ఎరువుల దుకాణంపై వ్యవసాయ శాఖ, పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ బిల్లులు, ధరల పట్టికలను తప్పనిసరిగా పరిశీలించి, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
లైసెన్సు ఉన్న ఎరువుల దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి.
తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి.
సంచిపై బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ) పరిశీలించాలి.
అధిక ధరలు లేదా నకిలీ ఎరువులపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలి.
రైతులను దోచుకునే వారిపై ఉక్కుపాదం మోపాలి
సాగు సీజన్ను ఆసరాగా చేసుకుని కొందరు రైతులను దోపిడీ చేస్తున్నారు. నకిలీ ఎరువులు, అధిక ధరల విక్రయాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నకిలీ ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి , నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి , ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు అందేలా చూడాలి.
- రైతు, మాజీ సర్పంచ్ సురవరం లోకేశ్వర్ రెడ్డి






