16 May, 2026 | 2:49 AM

ప్రతాపం చూపుతున్న భానుడు

16-05-2026 01:15 AM

పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన

ఘట్ కేసర్, మే 15 (విజయక్రాంతి) : ఎండాకాలం ప్రభావం మే నెలలో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండదెబ్బ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 9 గంటలు దాటితే చాలు ప్రజలు ఇంటి నుండి బయటకు వెల్లేందుకు జంకుతున్నారు. రాత్రి 10 గంటలు దాటినప్పటికీ ఎండవేడిమి తగ్గడం లేదు. తమ తమ పనులపై బయటికి వెల్లే ప్రజలు ఉదయం, సాయంత్రం సమయాల్లో వెలితే మంచిదని, అత్యవసరం అయితేనే పగటిపూట వెల్లాలని, సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల వల్ల శరీరంలో సోడియం, పొటాషియం మోతాదులు తగ్గుతాయన్నారు. 

కొబ్బరినీళ్లు తాగడం శ్రేయస్కరం అన్నారు.  వాస్తవానికి వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు కొత్తేమి కాదు. వెనుకటి కాలంలో మన పెద్దలు ధరించిన తలపాగ, ఇప్పుడు ఇష్టపడరు కాబట్టి కనీసం తలపై టోపీలు, కళ్ల అద్దాలు దరించడం మంచిదంటున్నారు.  వేసవికాలం ముగిసే వరకు కాటన్ బట్టలు దరించడం, ఎక్కువగా నీళ్లు తాగడం ద్వారా కూడా కొంతమేర ఈ వేడిమి ప్రభావం నుంచి తప్పించుకొవచ్చన్నారు. ఆహారం విషయంలోను పలు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా రోడ్లపై కనిపించే తినుబండారాలకు దూరంగా ఉండాలన్నారు. ఎండాకాలం ముగిసేవరకు నాన్వెజ్కు దూరంగా ఉంటే మరీమంచిదని, ప్రత్యేకించి నిల్వఉంచిన ఆహార పదార్ధాలు తీసుకోవద్దన్నారు.

తాజా ఆహార పదార్దాలు తీసుకోవాలని ఐస్ విషయంలోను పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు పక్కనే పడేసి విక్రయించిన ఐస్ వాడినా, సీతల పానీయాలు సేవించడం ద్వారా కూడా రోగాలు వస్తాయన్నారు . ఎండాకాలంలో మనం ఎదుర్కొనే గొంతునొప్పికి నీటి కాలుష్యమే ప్రధాన కారణం. పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అనే తేడాలేకుండా ఈ వేసవిలో ఎండదెబ్బకు గురికాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పరీక్షలు ముగిసిన తరువాత పిల్లలు ఎండలో తిరుగకుండా జాగ్రత్తలు పడాలని వైధ్యాధికారులు పిల్లల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.