31 July, 2026 | 1:12 AM

ఈ-20 విధానాన్ని నిలిపివేయాలి

31-07-2026 12:00 AM
  1. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరిని తొలగించాలి 
  2. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ డిమాండ్

ముషీరాబాద్, జూలై 30(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ఈ-20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్) విధానాన్ని నిలిపివేయాలని, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ-20 విధానం వల్ల ప్రస్తుతం వినియోగంలో ఉన్న కోట్లాది వాహనాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని, మైలేజ్ తగ్గడం, ఇంజిన్ మరమ్మతుల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ-20 అమలుకు ముందు స్వతంత్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని కోరారు. ఆగస్టు1న అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించే ఈ-20పై ఆన్లైన్ చర్చలో వాహనదారులు, మెకానిక్లు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ వింగ్ అధ్యక్షుడు నేరేటి ఆంజనేయులు, రాష్ట్ర నాయకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.