calender_icon.png 22 December, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి రైతుల కన్నీటి పోరు

22-12-2025 11:47:02 AM

తూకం వేసినా కదలని వడ్ల బస్తాలు!

నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. కేంద్రానికి వచ్చి నెల రోజులు, తూకం వేసి పది రోజులు గడుస్తున్నా.. ధాన్యం మాత్రం కదలడం లేదు. సుమారు 1500 బస్తాల వడ్లు రోడ్లపైనే ఉండిపోవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ కేంద్రానికి ఆరు రైస్ మిల్లులను కేటాయించినప్పటికీ, ఏ ఒక్క మిల్లర్ కూడా ధాన్యం సేకరించడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.రైతులు స్వయంగా వెళ్లి ప్రాధేయపడినా మిల్లర్లు కనికరించడం లేదు. గత వారం రోజులుగా ఒక్క లారీ కూడా ఇక్కడి నుండి వెళ్లకపోవడంతో పరిస్థితి విషమించింది.

కేవలం 8 లారీల ధాన్యం తరలిస్తే కొనుగోళ్లు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నా, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రక్రియ స్తంభించిపోయింది.స్థానిక రైతులు తమ గోడును సర్పంచ్ నరేష్ ద్వారా ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు.ఎమ్మెల్యే స్పందించి అధికారులతో మాట్లాడగా, వారు పంపిస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు.ఇప్పటివరకు ఒక్క లారీ కూడా రాకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, మొండికేస్తున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ధాన్యం తరలింపు పూర్తి చేసి తమను ఆదుకోవాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు.