9 June, 2026 | 1:14 AM

తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలి

09-06-2026 12:00 AM

సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి

ముషీరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందుతూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని సమైక్యాం ధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గుంటి కుమార్ చౌదరి యాదవ్ ఆకాంక్షించారు.

చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని ఆయన ప్రజలకు, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే నినాదాలకు స్వస్తి పలికి అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త పరిశ్రమలను ఆకర్షించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.

హైదరాబాద్ స్టేట్ను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అలాగే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య సేవలను స్మరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రశాంతంగా జీవించారని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని, ఆయన తెలంగాణ అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని, దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.