పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
- బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి
మహబూబ్నగర్ క్రైం జూన్ 8 : నవాబుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు పస్పుల నందు (29), మోతీఘన్పూర్ గ్రామం, బాలానగర్ మండలం పై విచారణ పూర్తి కాగా, మహబూబ్నగర్లోని ప్రత్యేక పోక్సో అత్యాచార కేసుల విచారణ న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా, బాధితురాలికి రూ.5 లక్షల బాధిత పరిహారం చెల్లించాలని జడ్జి తమన్ రాజరాజేశ్వరి తీర్పు ఇచ్చారు.
ఈ కేసును అత్యంత సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించి, న్యాయస్థానంలో విజయవంతంగా నిరూపించడంలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.జాన్, మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, నవాబుపేట్ ఎస్‌ఐ విక్రమ్తో పాటు సంబంధిత సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీస్ శాఖ అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును శాస్త్రీయ దర్యాప్తుతో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పోక్సో చట్టం కింద నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






