7 July, 2026 | 2:22 AM

అభివృద్ధి ఫలాలు దక్కిందెవరికి?

07-07-2026 12:00 AM

ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్న వాదన ఏమిటంటే---, గత పన్నెండేళ్లలో తెలంగాణ రాష్ర్టం అపూర్వమైన ఆర్థికాభివృద్ధిని సాధించిందని. రాష్ట్ర స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి సూచీలను చూపిస్తూ పాలకులు తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ర్టంగా అభివర్ణిస్తున్నారు.

అయితే, ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి నిజంగా సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరిందా? అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికీ, ప్రతి కులానికీ, ప్రతి ప్రాంతానికీ అందాయా? అదే నిజమైతే మానవాభివృద్ధి సూచికలో మనం ఎక్కడున్నాం?

‘తెలంగాణ అభివృద్ధి అందరిదీ’ అనడం శుద్ధ అబద్ధం. అభివృద్ధిని కొలిచే ప్రమాణాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జీఎస్డీపీ, తలసరి ఆదాయం, పెట్టుబడులు, ఎగుమతుల వంటి స్థూల సూచికలపై ఎక్కువ దృష్టి పెట్టాం. ఇకపై ఆదాయం, ఆస్తుల పంపిణీ, ప్రాంతీయ సమానత్వం, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, ఉపాధి, విద్య, ఆరోగ్య సేవల సమాన లభ్యత వంటి సూచికలను కూడా అభివృద్ధి కొలమానాల్లో భాగం చేయాలి.

అభివృద్ధి అధ్యయనాల్లో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి ఒక్కటే కావు. ఒక రాష్ర్టం సంపదను ఎక్కువగా సృష్టించవచ్చు. కానీ, ఆ సంపద సమాజంలోని అన్ని వర్గాలకు,  ప్రాంతాలకు, కుటుంబాలకు సమానంగా చేరకపోవచ్చు. అందువల్ల అభివృద్ధిని జీఎస్డీపీ లేదా తలసరి ఆదాయం వంటి సమగ్ర సూచికలతో మాత్రమే అంచనా వేయడం సరికాదు. తలసరి ఆదాయం అంటే రాష్ట్ర మొత్తం ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగించిన సగటు.

తలసరి ఆదాయం ఒక దేశం లేదా రాష్ట్ర ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి ముఖ్య సూచిక. ఇది ప్రజల సగటు ఆదాయాన్ని చూపుతుంది కానీ, అసమానతలను ప్రతిబింబించదు. ప్రభుత్వాలు దీనిని ఆధారంగా తీసుకుని పేదరిక నిర్మూలన, నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాల రూపకల్పన వంటి విధాన నిర్ణయాలు తీసుకుంటాయి. అలాగే పెట్టుబడిదారులు మార్కె ట్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

అంతేకాకుండా దేశాల మధ్య ఆర్థిక అభివృద్ధిని పోల్చడానికి ఇది కీలక ప్రమాణంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు నేడు భారతదేశం సుమారు 4.15 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అయితే, అదే సమయంలో తలసరి ఆదాయం పరంగా చూస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి తాజా అంచనాల ప్రకారం, ప్రపంచంలోని సుమారు 194 దేశాలు/ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 147వ నుంచి 150వ స్థానం మధ్య ఉంది. అంటే అత్యంత వెనుకబడిన దేశం.

తెలంగాణ తలసరి ఆదాయం పెరుగు దల వాస్తవ అభివృద్ధేనా?: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన 2014-- రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా, భారతదేశ తలసరి ఆదాయం రూ.98,405 ఉంది. 2025 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కి, భారతదేశ తలసరి ఆదాయం రూ.2,19,575కి చేరుకుంది.

అంటే తెలంగాణలో తలసరి ఆదాయం సుమారు 337.56%, భారతదేశంలో 223.13% పెరిగింది. ఈ గణాంకాలను ఆధారంగా చేసుకొని దేశంలోనే తెలంగాణ అత్యం త వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటిగా ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఇక్కడ ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది.

ఈ పెరుగుదల నిజంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడినందువల్ల వచ్చిందా? లేక కొన్ని ప్రత్యేక రంగాలు, అప్పులు, కొద్ది జిల్లాలు, కొద్ది వర్గాల ఆదాయం పెరగడం వల్ల రాష్ట్ర సగటు మాత్రమే పెరిగిందా?

ఆదాయమంతా హైదరాబాద్ చుట్టే: రాష్ట్ర ఆదాయం ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-- మల్కాజిగిరి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో కేంద్రీకతమై ఉంది. ఐటీ, ఫార్మా, కార్పొరేట్ సేవలు, రియల్ ఎస్టేట్, బొగ్గు, ఫైనాన్షియల్ సేవలు వంటి రంగాలు రాష్ట్ర ఆదాయాన్ని వేగంగా పెంచాయి.

అదే సమయంలో వ్యవసాయాధారిత జిల్లాలు, గిరిజన ప్రాంతాలు, వర్షాధార వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు, అసంఘటిత రంగ కార్మికుల ఆదాయ పెరుగుదల అదే వేగంతో జరగలేదనేది మిగతా జిల్లాల తలసరి ఆదాయం పరిశీలిస్తే తెలుస్తుంది. 2014 తర్వాత హైదరాబాద్‌లో శాంతిభద్రల పరిస్థితి స్థిరంగా ఉండటం, ఐటీ రంగం వేగంగా విస్తరించడం, ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అభివృద్ధి చెందడం, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం వంటి కారణాల వల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెరిగాయి.

వ్యవసాయ ఉత్పత్తి పెరగడం వాస్తవమే. కానీ, అందుకకు ప్రభుత్వం మాత్రమే కారణమని చెప్పడం సరైంది కాదు; ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని చెప్పడమూ సబబు కాదు. ఈ పెరుగుదలకు కలిసి పనిచేసిన ప్రధాన అంశాలు: 1. సాగునీటి విస్తరణ. తెలంగాణ ప్రభుత్వ సమాచారం ప్రకారం కొత్తగా సృష్టించిన సాగునీటి సామర్థ్యం: 13.67 లక్షల ఎకరాలు, స్థిరీకరించిన పాత ఆయకట్టు: 2.10 లక్షల ఎకరాలు.

ఇరిగేషన్ మీద బీఆర్‌ఎస్ సర్కార్ రూ.1.81 లక్షల కోట్లు, ప్రస్తుత కాంగ్రె స్ ప్రభుత్వం రూ.70వేల కోట్లు ఖర్చు పెట్టింది. ఒకవైపు పేదల ఆర్థికాభివృద్ధి పథకాలను పండబెట్టి ఒక్క రంగానికే ప్రాధాన్యం ఇవ్వటంతో సమ్మిళిత అభివృద్ధి జరగలేదు. 2. చెరువుల పునరుద్ధరణ. 3. రైతుబంధు. 4. ఉచిత విద్యుత్. 5. మంచి వర్షపాతం.

6. మెరుగైన విత్తనాలు, యాంత్రీకరణ. 7.వరి కొనుగోలు విధానం. అయితే, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, రైతుల సంక్షేమం లేదా గ్రామీణ కుటుంబాల ఆదాయం సమానంగా పెరగడం రెండూ ఒకటే కావు. ఉత్పత్తి పెరిగినా వ్యయాలు, ధరల అస్థిరత, అప్పులు, భూ స్వామ్య అసమానతలు వంటి అంశాలు రైతుల నిజమైన ఆర్థిక స్థితిని నిర్ణయిస్తాయి.

అప్పులతో పెరిగిన అభివృద్ధి  స్థిరమైన దేనా?: తెలంగాణ తలసరి ఆదాయం పెరగడంలో అప్పుల పాత్రను విస్మరించలేం. 2026 మార్చి 31 నాటి కాగ్ నివేదిక ప్రకారం 2014లో తెలంగాణ అప్పు సుమారు రూ.91,985 కోట్లు ఉంది.

ఇందులో ఎఫ్‌ఆర్‌బీఎం అప్పులు రూ. 69,517 కోట్లు కాగా, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు వెలుపల ఉన్న అప్పులు సుమారు రూ.22,000 కోట్లు. అయితే 31 మార్చి 2025 నాటికి ఎఫ్‌ఆర్‌బీఎం అప్పులు సుమారు రూ.3,91,881 కోట్లకు పెరిగాయి.

దీనికి అదనంగా స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ప్రభుత్వ కార్పొరేషన్లు తమ సొంత హామీలతో తీసుకున్న అప్పులు రూ.2,41,528 కోట్లకు చేరాయి. అంటే  మొత్తం రూ.6,33,409 కోట్లు. ఇవి కాకుండా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, డిస్కమ్‌లు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లు, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఇతర చెల్లింపులు కలిపి మరో రెండు లక్షల కోట్ల వరకు  ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ లెక్కలన్నింటినీ కలిపి చూస్తే, రాష్ట్ర రుణభారం ఈ 12 ఏళ్లలో 9 రెట్లు పెరిగినట్లు స్పష్టమవుతుంది. అలాగే బడ్జెట్‌లో సుమారు రూ.21 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇంత భారీగా అప్పులు తీసుకుని ప్రభుత్వ వ్యయం పెరిగినప్పుడు, కొంత తలసరి ఆదాయం పెరిగి ఉండవచ్చు. 

ఒక చేత్తో ఇస్తూ.. మరో చేత్తో వసూలు: తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాల ద్వారా సబ్సిడీలు, నగదు బదిలీలు అందిస్తున్నామని చెప్తూ, మరోవైపు మద్యం విక్రయాలపై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ రూపం లో భారీ మొత్తంలో ఆదాయాన్ని సమీకరిస్తోంది. 2025-- ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్, వ్యాట్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.40,000 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు బడ్జెట్ లెక్కలు చెప్తున్నాయి.

2026 మార్చి 31 నాటి కాగ్ రిపోర్ట్ ప్రకారం 2024  సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్ను ఆ దాయం సుమారు రూ.1.09 లక్షల కోట్లు. కాగా రాష్ట్ర ఎక్సైజ్ ద్వారా రూ.18,604 కో ట్లు వచ్చాయి. అలాగే వ్యాట్ ద్వారా రూ. 31,816 కోట్లు రాగా, వీటిలో రూ.18,000 కోట్లు మద్యం ద్వారానే వచ్చినట్లు అంచనా. సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయంలో గణనీయమైన భాగం మద్యం వినియోగంపై విధించే పన్నుల రూపంలో తిరిగి ప్రభుత్వ ఖజానాకే చేరుతున్నది. 

మానవాభివృద్ధి సూచికలో ఎక్కడున్నాం?: మానవాభివృద్ది సూచిక అనేది ఒక దేశం లేదా రాష్ర్టంలో ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేసే సూచిక. అంటే, ఒక రాష్ర్టం లేదా దేశం అభివృద్ధి చెందిందని చెప్పాలం టే కేవలం తలసరి ఆదాయం పెరగడం సరిపోదు.

ప్రజల ఆయుర్దాయం, విద్యాస్థాయి, ఆదాయం--- ఈ మూడు రంగాల్లో సమతుల్య పురోగతి సాధించాలి. తాజా మానవాభివృ ద్ధి నివేదిక 2025 (2023 డేటా ఆధారంగా) ప్రకారం భారతదేశం ప్రపంచంలోని 193 దేశాల్లో 130వ స్థానంలో ఉంది. 0.685 హెచ్‌డీఐ విలువతో భారత్ మీడియం హ్యూమన్ డెవలప్‌మెంట్ వర్గంలో ఉంది.

తాజాగా అందుబాటులో ఉన్న ఉప మానవాభివృద్ధి సూచిక అంచనాల ప్రకారం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాం తాలు కలిపితే తెలంగాణ 22వ స్థానంలో ఉంది. అలాగే 28 రాష్ట్రాలను మాత్రమే పరిగణిస్తే తెలంగాణ 15వ స్థానంలోనే ఉంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత విడుదలైన తొలి సమగ్ర రాష్ట్ర  సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్  ప్రకారం 2011-- ఆధారిత గణాంకాల్లో తెలంగాణ 21 ప్రధాన రాష్ట్రాల్లో 10వ స్థానంలో నిలిచింది.

అంతకుముందు (2004-- ఇదే ప్రాంతం 13వ స్థానంలో ఉండేది. మరి ఏమైంది అభివృద్ధి? మన ర్యాంక్ మెరుగుకావాల్సింది పోయి ఎందుకు  పడిపోయింది? పాలకులు ఈ విషయాల గురించి మాట్లాడరు.

ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ అభివృద్ధిని కేవలం ఆదాయం పెరుగుదలతో కొలవకూడదని వాదించారు. విద్య, ఆరోగ్యం, అవకాశాలు, గౌరవప్రదమైన జీవితం, నిర్ణయాలలో భాగస్వామ్యం వంటి అంశాలు కూడా అభివృద్ధి కొలమానాలే. ఈ దృక్కోణంలో చూస్తే, తెలంగాణ లో అభివృద్ధి వల్ల ఎవరి సామర్థ్యాలు పెరిగాయి? ఎవరి అవకాశాలు విస్తరించాయి? అంటే పాలకుల, ఆధిపత్య కులాలు లబ్ది పొందినవి తప్ప బహుజనులకు ఏమి ఒరగలేదనేది  అక్షర సత్యం.

అలాగే థామస్ పికెట్టి సంపద కేంద్రీకరణపై చేసిన పరిశోధనల ప్రకారం ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ మూలధనం, భూమి, వ్యాపారాలు, పెట్టుబడులు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకతమైతే, సంపద అసమానతలు పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణలో అదే జరిగింది. ఈ రోజు భారతదేశంలోనే ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని చెప్పక తప్పదు.

తెలంగాణలో ఇప్పటికీ ఒక కీలక లోటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కులాలవారీగా తలసరి ఆదాయం, ఆస్తులు, భూయాజమాన్యం, పరిశ్రమల యాజమాన్యం, ప్రభుత్వ కాంట్రాక్టులు, బ్యాంకు రుణాల పంపిణీ వంటి గణాంకాలను సేకరించడం లేదు. సీపెక్ సర్వే కొన్ని వివరాలు తెల్పినప్పటికీ, అది సమగ్ర సర్వే కాదు.

అలాగే విశ్వవిద్యాలయాలలో కులాలవారీగా తలసరి ఆదాయాలపై పరిశోధనలు లేవు. ఈ సమాచారం లేకుండా అభివృద్ధి ఫలితాలు ఏ సామాజిక వర్గాలకు ఎంత మేరకు చేరాయో శాస్త్రీయంగా నిర్ధారించడం కష్టం.

ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అంటే కేవలం సంపదను సృష్టించడం కాదు; ఆ సంపద ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయంగా చేరడం కూడా.కొద్దిమందికే పరిమితమైన వృద్ధి అధిక వృద్ధి కావచ్చు. కానీ అది సమ్మిళిత అభివృద్ధి కాదు. ఈ అభివృ ద్ధి నవనా సరైనది కాదు. నెహ్రూ ట్రిక్ల్ డౌన్ థియరీ లాంటిదే.

అందువల్ల తెలంగాణకు ఇప్పుడు అవసరమైనది సామాజిక న్యాయా న్ని కేంద్రంగా చేసుకున్న అభివృద్ధి నమూనా. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సామాజిక వర్గాల వారీగా ఆదాయం, ఆస్తులు, విద్య, ఉపాధి, ప్రభుత్వ వ్యయాల ప్రయోజనాలపై సామాజిక సమానత్వ నివేదికను విడుదల చేయాలి.

తెలంగాణ అభివృద్ధిపై చర్చ ‘ఎంత వృద్ధి సాధించాం?’ అనే ప్రశ్నతో ముగియకూడదు; ‘ఆ వృద్ధి ఫలాలు ఎవరికీ దక్కాయి?’ అనే ప్రశ్నతో ప్రారంభం కావాలి. అదే నిజమైన అభివృద్ధి. అదే రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం. అదే సమ్మిళిత, సామాజిక తెలంగాణకు పునాది.

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్