12 August, 2026 | 2:09 AM

తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌ను నిర్మించాలి

12-08-2026 12:53 AM
  1. ఎల్లంపల్లికి అనుసంధానించాలి
  2. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

పంజాగుట్ట,ఆగస్టు11(విజయక్రాంతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీని యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఎల్లంపల్లి ప్రాజెక్టుతో అనుసంధానం చేయాలని తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సాధన సమితి, తెలంగాణ జలసాధన సమి తి ప్రతినిధులు డిమాండ్ చేశారు.ఈ అంశం పై మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం లో పలువురు ప్రజా ప్రతినిధులు, నీటిపారుదల నిపుణులు, సామాజిక నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సమావేశానికి తెలంగాణ జలసాధన సమితి రాష్ట్ర కన్వీనర్ నైనాల గోవర్ధన్ అధ్యక్షత వహించారు. మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిపై ఎన్డీఎస్‌ఏ నివేదికలో వ్యక్తమైన అంశాలను ప్రస్తావిస్తూ తుమ్మిడిహెట్టి బ్యారేజీ ముందుగానే నిర్మితమై ఉంటే రాష్ట్రానికి ప్రస్తుత నీటి కొరత నుంచి కొంత ఉపశమనం లభించేదన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రాణహిత జలాలను సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తక్షణమే చేపట్టాలని సూచించారు.

మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ.. కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయ ని, ప్రజాధనం వృథా కాకుండా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ప్రాధాన్యంతో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నీటిపారుదల విశ్లేషకుడు సారంపల్లి మల్లారెడ్డి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోతున్నాయని,భారీ నిధులు వెచ్చించినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదన్నారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి టి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన అనేక ప్రాజె క్టులు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.

సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి ఎం.హన్మేష్,మహిళా నాయకురాలు సజయ,పీఓడబ్ల్యూ జాతీయ నాయ కురాలు సంధ్య తదితరులు కూడా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని వేగవంతం చేసి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు,తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో రైతు నాయకులు రామన్న, పీఓడబ్ల్యూ నాయకురాలు ఝాన్సీ, ప్రజా ఫ్రంట్ నాయకులు జైపాల్ సింగ్, లాల్ కుమార్, శ్రీనివాస్, ఐఎఫ్టీయూ నాయకురాలు అనురాధ, సోగరా బేగం, బ్రహ్మానం దం తదితరులు పాల్గొన్నారు.