calender_icon.png 12 January, 2026 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాణిజ్య ఒప్పందం పేచీ!

11-01-2026 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడకపోవడం వల్లనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదంటూ ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. గతేడాది ఫిబ్రవరి 13 నుంచి ఇరుదేశాల మధ్య పలుమార్లు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి. కొన్ని విషయాల్లో అంగీకారం కుదరకపోవడంతో ఒప్పందం సాధ్యపడలేదు.

చివరిసారిగా డిసెంబర్ 11న భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు తుది దశకు వచ్చాయని, త్వరలోనే ఒప్పందం జరుగుతుందని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ఆనాడు ప్రకటించారు. అయితే ట్రంప్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడనందునే ట్రేడ్ డీల్ జరగడం లేదని లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. ఇదే విషయాన్ని భారత విదేశాంగశాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

గతేడాది నుంచి వివిధ అంశాలకు సంబంధించి మోదీ, ట్రంప్ ఇప్పటివరకు 8 సార్లు ఫోన్‌లో సంభాషించుకున్నారన్నారు. ట్రంప్ మాట్లాడిన ప్రతీసారి మోదీ తనకు మంచి మిత్రుడనీ, భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు చెప్పినట్లు తెలిపారు. బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిన వెంటనే, తదుపరి ఒప్పందం భారత్‌తోనే అని ట్రంప్ స్వయంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

అయితే వాణిజ్యం విషయంలో భారత్‌కు స్పష్టమైన విధానాలు ఉన్నాయని, ఏ దేశంతోనైనా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు తన సర్వాధికారాన్నీ, స్వతంత్రతను కాపాడుకునే విధంగానే సంప్రదింపులు జరుపుతుందని జైస్వాల్ స్పష్టం చేశారు. ఇక ప్రతీ ఏడాది అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాది మాత్రం ఒప్పందంపై సంతకాలు చేసే విషయంలో జాప్యానికి అమెరికా అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణమని చెప్పొచ్చు.

ముఖ్యంగా చమురు కొనుగోలు విషయంలో భారత్ మొదటి నుంచి ఒక స్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్నది. ఎన్నో ఏళ్లుగా మనం రష్యా నుంచే చమురు కొనుగోలు చేస్తూ వస్తున్నాం. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ ట్రంప్ పదేపదే ఆంక్షలతో భారత్‌ను బెదిరింపులకు గురి చేస్తున్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా వారితో వ్యాపారం ఆపకపోతే టారిఫ్‌ను 500 శాతానికి పెంచడానికి సిద్ధమవుతున్నట్లు ప్రత్యక్ష హెచ్చరికలకు దిగడం కూడా భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యానికి కారణంగా నిలిచింది. ఇటీవలే వెనిజులాను తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్న అమెరికా.. తమ నుంచి మాత్రమే చమురును కొనాలంటూ భారత్ సహా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదు.

పైగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని రష్యా ఆపాలనే ఉద్దేశంతోనే ఆ దేశం నుంచి చము రు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు ట్రంప్ తనను తాను సమర్థించుకున్నారు. అంతేకాదు కేవలం సుంకాల విషయంలోనే వారం వ్యవధిలో తాను సంతోషంగా లేనన్న విషయం మోదీకి తెలుసని ఒకసారి, మోదీ నా పట్ల సంతోషంగా లేరంటూ మరోసారి భారత్ పట్ల మాటలు మార్చడం ట్రంప్‌కే చెల్లింది. ఈ నేపథ్యంలో భారత్‌తో ట్రేడ్ డీల్ జరగకపోవడానికి కారణమేంటనే దానిపై అమెరికా ఆత్మవిమర్శ చేసుకోవాలి.