calender_icon.png 8 July, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనవాయితీగా పీర్ల పండుగ

08-07-2025 01:26:42 AM

మణుగూరు, జూలై 7( విజయ క్రాంతి ) : మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో పీర్ల పండుగ వేడుకలను, ఆనవాయితీగా.. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను, హిందూ, ముస్లింలు సోదర భావంతో 11 రోజుల పాటు జాగరణ నిర్వహిస్తూ,పిరీలను ఎత్తుకొని గ్రామం పుర వీధులలో ఊరేగింపుగా తిప్పుతూ డప్పు వాయిద్యాలతో, నృత్యా లతో అనుకున్న కోరిక నెరవేరాలని, అత్యంత వైభవంగా పీర్ల వేడుకలను జరుపుకుంటారు.

ఇంత ఘనంగా జరుపుకునే పీర్ల పండుగ వేడుకలకు శివలింగాపురం ప్రత్యేకంగా నిలుస్తుంది. గ్రామం పెద్దలు, ముస్లిం కులస్తులు పీర్ల పండగను కులమతాలకు అతీతంగా నేటికి అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామ నడిబొడ్డున ఉన్న పీర్ల కొట్టంలో మండలంలో ఎక్కడా లేని విధంగా పీర్లను ప్రతిష్ఠిస్తారు.

మోహర్రం మాసంలో పుణ్యం కలుగాలని కోరుకుంటూ కొత్తమంది భక్తులు పది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారు. పీర్లను ఊరేగింపుగా ఇంటింటికీ తిరుగగా ఊదు, దట్టీలు, మలీద ముద్దలు, బెల్లం, కానుకలు సమర్పించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

గ్రామ ప్రధాన వీధుల్లో మేళ తాళాల మధ్య పీర్లను ఊరేగించిన పీర్లను సమీప చెరువులో నిమజ్ఞనం చేస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. పీర్ల పండుగ చివరి రోజైన సోమవారం పీర్ల స్వాములను పూల షేరాలు, కొత్త బట్టలతో అలంకరించారు. గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు పీర్ల కు పూల షేరాలు, పూల దండలు, చక్కెరతో చదివింపులు చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రమ పెద్దలు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.