calender_icon.png 14 May, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుదైన ఘట్టానికి వేదికగా అపురూప శిల్పకళ ‘రామప్ప’

14-05-2025 12:00:00 AM

నేడు రామప్ప కు విశ్వ సుందరీమణుల రాక శిల్పకళ కు నూతన శోభ 

ములుగు, 13 (విజయ క్రాంతి): తెలంగాణలోని అద్భుత శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తూ యునెస్కో గుర్తింపు పొందిన విశిష్ట వారసత్వ సంపద గా నిలుస్తున్న రామప్ప దేవాలయం అరుదైన ఘట్టానికి వేదిక కానుంది. ప్రపంచ దేశాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అందగత్తెలు ఈ విశిష్ట వారసత్వ స్థలాన్ని సందర్శించడానికి ఈనెల 14న ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని రామప్పకు వస్తున్నారు.

హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాలకు చెందిన సుందరిమణులు ఆధ్యాత్మికత శిల్ప, సౌందర్యం కలగలిసిన రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరిష్ ప్రపంచ సుందరీమణుల రాక కోసం చేస్తున్న స్వాగత ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

హైదరాబాదులో నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వివిధ దేశాలకు చెందిన 35 మంది సుందరీమణులు బుధవారం సాయంత్రం 4:30 గంటలకు ములుగు జిల్లా రామప్ప చారిత్రాత్మక ఆలయాన్ని సందర్శించనున్నారు. పూర్తిగా ఇక్కడి సంప్రదాయ దుస్తుల్లో రామప్ప ఆలయాన్ని సందర్శించడం ప్రత్యేకతగా చెబుతున్నారు.

వారి కోసం ఆలయ ఆవరణలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ రామప్ప ఆలయ విశేషాలను వారికి వివరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో ఆరోజు ఇతర పర్యాటకులకు ప్రవేశం లేదని జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రకటించారు.

‘తెలంగాణ జరూర్ ఆనా’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రపంచ సుందరీమణులు పాల్గొంటున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.