12-08-2025 06:16:12 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఆత్మకూరు మున్సిపాలిటీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటరును తనిఖీ చేశారు. ప్రసవాల రిజిస్టరు, ఈ.డి.డి రిజిస్టరు, ల్యాబ్ రిజిస్టరును పరిశీలించిన కలెక్టర్ కమ్యూనిటీ హెల్త్ సెంటరులో నలుగురు డాక్టర్లు, 7 మంది స్టాఫ్ నర్సులు, ఒక హెడ్ నర్స్, అన్ని మౌలిక సదుపాయాలు ఉండి నెలలో 2-3 ప్రసవాలు మాత్రమే జరగటం ఏంటని సూపరిండెంట్ ను ప్రశ్నించారు.
ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది మధ్య సమన్వయం చేసుకోవాలని, ఈ.డి.డి. ఉన్న గర్భిణులు, ఆశా వర్కర్లతో మాట్లాడి సి.హెచ్.సి లో ప్రసవాలు జరిపించాలని ఆదేశించారు. నెలలో కనీసం 30 ప్రసవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జ్వరం ఒళ్ళు నొప్పులతో వచ్చే రోగులకు కచ్చితంగా డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని, ర్యాట్ పరీక్షల్లో పాజిటివ్ వస్తె టి. హబ్ కు పంపించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా శ్రీనివాసులు, డా. చైతన్య, సి హెచ్.సి వైద్యులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.