14-05-2025 12:00:00 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మహబూబాబాద్, మే 13 (విజయ క్రాంతి): పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, గత ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేస్తే ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఒక్క పైసా అదనంగా ప్రజలపై భారం వేయకుండానే సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రపురం, లక్ష్మీ నరసింహ పురం, కొమ్మవరం గ్రామాల్లో నూతనంగా నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ పురం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, తమ జేబులు నింపుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.
ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధారణ ప్రజలకు మేలు కలిగే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే తట్టుకోలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లుగా నిలువ నీడలేక సొంత ఇంటి కోసం నిరీక్షిస్తున్న పేదలకు 22,500 కోట్లతో ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పునాది వేసిందన్నారు.
అలాగే మారుమూల గిరిజన ప్రాంతాల నియోజకవర్గాలకు 3,500 చొప్పున కాకుండా అదనంగా మరికొన్ని ఇండ్లు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది మరో నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు ఉపాధి దక్కుతుందని ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులను గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 51 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.
మరో 30 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకంలో తొమ్మిది వేల కోట్లతో ఉపాధి కల్పించేందుకు కేటాయించి జూన్ 2న నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టి అలాగే వారి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి, సొంతంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అలాగే దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టి సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేక సాగుకు దూరంగా ఉన్న మూడున్నర లక్షల ఎకరాల భూమిని సాగులోకి తేవడానికి కొత్తగా ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మారు మూల గిరిజన ప్రాంతాల్లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ ద్వారా పట్టాలు పొంది భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కరెంటు సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో ఈ సరికొత్త పథకాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ పథకాన్ని ఈనెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో ప్రారంభిస్తారని ప్రకటించారు.
సౌర విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా సోలార్ పంపుసెట్టు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించి 3 పంటలు పండించే విధంగా హార్టికల్చర్ శాఖ ద్వారా గిరిజన రైతులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.
అలాగే వ్యవసాయ రంగానికి ఏటా 12,500 కోట్లతో ఉచిత విద్యుత్ సరఫరా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో 90 శాతం నిరుపేదలకు ప్రతినెల 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామని, 12 వేల రూపాయలు రైతులకు, భూమిలేని నిరుపేద కుటుంబానికి 12 వేల చొప్పున అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇంతే కాకుండా మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ట్రాన్స్కో సీఎండీ వరుణ్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఖమ్మం డిసిసి అధ్యక్షుడు దుర్గాప్రసాద్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.