25-11-2025 12:00:00 AM
సంస్థాన్ నారాయణపూర్, నవంబర్24 (విజయక్రాంతి): పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన రిజర్వేషన్లతో కొంతమంది నిరాశ చెందగా, మరికొందరు సంతోషంతో పోటీకి రెడీ అవుతున్నారు. పోటీకి రెడీ అవుతున్న ఆశావహులు పల్లెల్లో సందడి చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ గతంలో రిజర్వేషన్లు ప్రకటించగా రెడ్డి జాగృతి కోర్టులో వేసిన కేసు ద్వారా పాత పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తమకు మారే రిజర్వేషన్లలో అవకాశం తప్పక వస్తుందని ఎదురు చూసిన నాయకులకు మొండి చెయ్యే మిగిలింది.
నిరాశలో ముఖ్య నాయకులు
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని నెలలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన కొందరు నాయకులు రిజర్వేషన్ మారడంతో నిరాశకు లోనయ్యారు. తాను సర్పంచ్ కావడం ఖాయమనుకున్న సీనియర్ లీడర్లు రిజర్వేషన్ల మార్పుతో పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తీవ్ర అసహనానికి లోనవుతున్నట్టు తెలుస్తుంది.
నిన్నామొన్నటి వరకు పండుగలకు పబ్బాలకు ఆర్థిక సాయాలు అందజేసి తాము పోటీలో ముందుండాలని భావించిన పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. ఒక్కో నాయకుడు లక్షల్లో ఖర్చు పెట్టి రిజర్వేషన్ల ప్రకారం పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మదనపడుతున్నారు. నెల క్రితం వెలువడిన మొదటి రిజర్వేషన్లతోనే సగం మంది ఆశావహులు నిరాశ నిస్పృహకు లోనయ్యారు. కానీ, కోర్టు తీర్పు ప్రకారం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పడంతో మళ్ళీ కొంతవరకు ఆశావహంగా ముందుకెళ్తున్నారు.
స్థానికులకే ఇవ్వాలంటున్న యువత
ఎన్నికలు అనగానే హైదరాబాద్ నుంచి పల్లె బాటపట్టి.. గెలిచిన తర్వాత మకాం మార్చే నాయకులకు ఈసారి చెక్ పెట్టాలని యువత భావిస్తున్నది. స్థానికంగా ఉండకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే నాయకులను ఎన్నుకోవద్దని సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా నివాసముండే ప్రజల కష్టాలను తీర్చే నాయకుడిని ఎన్నుకోవాలని యువతలో చర్చ జరుపుతున్నారు.
యువత ఆసక్తి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా ఎంపీటీసీ జడ్పీటీసీ పదవులకు యువత పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు తాము కూడా పోటీ చేయాలనుకుంటున్నామని చాలామంది యువకులు భావిస్తున్నారు.