calender_icon.png 22 May, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజనుల సామాజిక రుగ్మతలను రూపుమాపిన దార్శనికుడు

12-04-2025 12:33:22 AM

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య 

సిద్దిపేట, ఏప్రిల్ 11(విజయక్రాంతి):సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజనుల అభివృద్ధికి దశ, దిశ తానై నిలిచిన గొప్ప దార్శనికుడు, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కొనియాడారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  లింగమూర్తి, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, వివిధ సంఘాల నాయకులు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి (డి.ఆర్.ఓ) నాగరాజమ్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సమాజంలో విద్య, స్వేచ్చ, సమానత్వం గురించి పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిబా ఫూలే అని,  ఆనాడు విద్య విషయంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపి ప్రతి మహిళ చదువుకోవాలనే సంకల్పంతో, ఆయన పడకగదినే తరగతిగదిగా మార్చి సావిత్రిబాయికి చదువు చేప్పడమె కాదు దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ను ఆయన ఇంటినుండే తయారు చేశారని, ఆ దూరదృష్టే ఇప్పుడు అందరికీ వరంగా మారిందని గుర్తుచేశారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ దేశ వైతాళికుడు, సత్య సాదక్ సమాజ స్థాపకులు,  భావి భారత సామాజిక వ్యవస్థ ప్రగతి పథాన్ని ఎంతో దూరదృష్టితో ఊహించి మార్గదర్శకం చేసిన  మహా దార్శనికుడు మహాత్మ జ్యోతిబా ఫూలే అని అన్నారు.  అనాగరికత, అసమానతలపై పోరాడి స్వాతంత్య్రానికి పూర్వమె గ్రామాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి అస్పృశ్య అణగారిన ప్రజలకు, స్త్రీలకు విద్యను అందించారన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే లాంటి మహనీయుల జీవిత ఆశయాలను పుణికిపుచ్చుకుని వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సమాజం అభివృద్ధిని సాధిస్తుందన్నారు. దేశంలో అనాగరికత, అస్పృశ్యత, తీవ్రమైన కుల వివక్ష కొనసాగుతున్న సమయంలోనే రేపటి భావి భారత పౌరులకు సరైన విద్యను అందించాలని అప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందని గ్రహించి, అందుకు మొదటి అడుగు తనే ప్రారంభించారని చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుల ఘనమైన మన్ననలు ఫూలే సాధించారని కొనియాడారు.