13-05-2025 11:40:55 PM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్..
మంచిర్యాల (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్(TB Mukt Bharat Abhiyaan) కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాలులో ప్రోగ్రామ్ అధికారులు, వైద్యాధికారులు, ఎం.ఎల్.హెచ్.పి., సూపర్వైజర్లు, టి.బి. నియంత్రణ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జిల్లాలో 19 నుంచి ప్రారంభించడం జరుగుతుందని, 100 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.
టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తొందరగా వ్యాధిని గుర్తించడం, సరైన చికిత్స అందించడం, ప్రజలలో మధుమేహం, హెచ్.ఐ.వి., క్యాన్సర్, గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి పరీక్షలు చేయించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 100 శాతం ప్రభావిత ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి గ్రామంలో ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, ఎం.ఎల్.హెచ్.పి.ల ద్వారా ప్రభావిత వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి గ్రామంలోనే పరీక్షలు నిర్వహించేందుకు 2 వాహనాలు కేటాయించి ఎక్స్ రే, పరికరాలు, సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, 60 ఏండ్ల పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని 100 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో 10 వ్యాధి లక్షణాలలో జ్వరం, 2 వారాలకు మించి దగ్గు, ఛాతినొప్పి, ఆకలి మందగించడం, బరువు తగ్గిన, గవద బిళ్ళలు, వాపులు, తెమడలో రక్తం రావడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే పరీక్షలు చేయడం జరుగుతుందని, వ్యాధి నిర్ధారణ అయి వారికి నిక్షయ పోషణ్ పథకం క్రింద ప్రతి నెల వేయి రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎక్స్ రే పరీక్ష ద్వారా 24 గంటలలో వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుందని, గ్రామంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజాప్రతినిధులు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వైద్యులు, ప్రముఖులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాలు, టి.బి. వ్యాధి వచ్చిన కోలుకున్న వారు, నిక్షయ మిత్రల సహాయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
2 రోజులలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మాతా శిశు సంరక్షణ, టీకాల కార్యక్రమం, హెచ్.ఐ.వి. ఎయిడ్స్, లింగ నిర్ధారణ, ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు, ఆసుపత్రి ప్రసవాలు అంశాలపై ప్రోగ్రామ్ అధికారులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ఎస్. అనిత, డాక్టర్ ఎ. ప్రసాద్, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ అనిల్, జిల్లాలోని 150 మంది వైద్యాధికారులు, ఎం.ఎల్.హెచ్.పి.లు, పర్యవేక్షకులు, జిల్లా టి.బి. మేనేజర్ సురేందర్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.