14 April, 2026 | 2:08 AM

గండి రామారం ఎత్తిపోతల పథకం పనులను జూన్‌లోగా పూర్తి చేయాలి

14-04-2026 12:12 AM

సుబేదారి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): గండి రామారం ఎత్తిపోతల పథకం పనులను జూన్ నెలాఖరు వరకు పూర్తిచేసి, వచ్చే వర్షాకాలంలో నీటితో చెరువులు నింపి రైతులకు సాగు నీరు అందించాలని స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే , మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. హన్మకొండ చింతగట్టు క్యాంప్ లోని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో గండి రామారం ఎత్తిపోతల పథకం పనులపై నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సుధీర్ తో కలిసి అధికారులు, కాంట్రాక్టర్లు, చిల్పూర్, వేలేరు మండలాల సర్పంచులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు.

లిఫ్ట్ 1 పనులు పూర్తి చేయడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తేవాలని కోరారు. అదనపు చెరువులు నింపాలని రైతుల నుండి వచ్చిన వచ్చిన విజ్ఞప్తులకు వెంటనే ఎస్టిమేషన్లు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. అధిక ప్రాధాన్యతతో లిఫ్ట్ 1పనులు పూర్తి చేయాలని, జులై మొదటి వారంలో ప్రారంబొత్సవం చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో జూన్ 30నాటికి గండి రామారం లిఫ్ట్ 1 పనులు పూర్తి చేసి వర్షాకాలం వరకు వేలేరు, చిల్పూర్ మండలాల రైతులకు సాగు నీరు అందించే విధంగా అధికారులు పనులు పూర్తి చేయించాలని అధికారులను కోరారు.