14 April, 2026 | 1:44 AM

భారతీయ సంస్కృతిలో యోగా ఒక భాగం

14-04-2026 12:11 AM

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

సుబేదారి, ఏప్రిల్ 13, (విజయక్రాంతి): యోగ  శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే మార్గమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో  యోగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా యోగాసనాలు చేసి పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగ మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగమని, ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన జీవన విధానమని తెలిపారు. నేడు యోగ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, అన్ని దేశాల్లో ప్రజలు దీనిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. యోగ కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, మనసు, ఆలోచనలు, జీవనశైలిని సానుకూల దిశగా మలిచే శక్తివంతమైన సాధనమని కలెక్టర్ అన్నారు. ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తగ్గి, శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో యోగ గురువు రవీంద్ర చారి, జిల్లా పర్యాటక శాఖాధికారి శివాజీ, జిల్లా ట్రెజరీ అధికారి శ్రీనివాసరావు,  జిల్లా పౌరసంబంధాల అధికారి ఆయూబ్ అలీ, డీఈ అరుణ, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, డిఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య, ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది యోగాభ్యాసకులు పాల్గొన్నారు.