మంథనిలో అలరించిన త్యాగరాజ ఆరాధనోత్సవం
శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర ఆలయంలో 129వ సంగీత విభావరి
కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ తిరుపతయ్య బృందం
మంథని జనవరి 4 (విజయక్రాంతి): మంథని పట్టణంలోని శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ కార్యక్రమం వైభవపీతంగా నిర్వహించారు. వరంగల్ కు చెందిన సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ తిరుపతయ్య, ఇతర సంగీత గురువుల ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఆలపించిన శ్రీ త్యాగరాజ కీర్తనలు భక్తులను మంత్రముగ్గులను చేసింది. మంథనిలోని ఈ ఆలయంలో నిర్వహించిన మా ఈ 129వ శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మంథని సంగీత కళాశాలలో మృదంగం విధ్వాన్సులుగా విధులు నిర్వహిస్తున్న భీమా శంకర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన సతీమణి కనకమాలక్ష్మి మాట్లాడుతూ మంథని మంచి భక్తికి ఆరాధనకు నిలయమని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ప్రతినిత్యం సప్త హాలు, ఆలయాల్లో ఎక్కాహం, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస భక్తి కార్యక్రమాలు, శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నిర్వహించే కార్తీక మాసం భక్తి కార్యక్రమాలు, శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవములు ఈ ప్రాంత భక్తి ప్రవృత్తులకు నిదర్శనం అన్నారు. వరంగల్ లోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో ప్రొఫెసర్ వెంకటరమణ సంగీత ల ఆధ్వర్యంలో ప్రతినెల మొదటి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు లోకే శరత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు న్యాయవాది లోకే రాధా కిషన్ రావు, లోకే శరత్ లను వారు మొదట సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ గాయకుల బృందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ సంగీత విద్వాంసకులు వి లక్ష్మణాచారి, ఎం సృజన్, షణ్ముఖ ప్రియా, మధులిక, సంతోష్, యజ్ఞంభట్ల లక్ష్మీరాజ్యం, శ్రీరంభట్ల నరహరి, అవధానుల శ్రీనివాస్, రామడుగు శారద, రామడుగు శ్రీనివాస్, గట్టు మాధవి, మారుపాక నిఖిలతో పాటు అవదానుల మధు, రావి కంటి మనోహర్, కాచే జగన్, మహావాది సతీష్ కుమార్, జంబోజి రాజేశం, కొల్లారపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






