18-01-2026 12:31:40 AM
చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్నవారంతా ఓ సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారంటేనే ఆ ఏడాది పొడవునా ఆ సినిమా కోసం అభిమానులే కాదు సినీప్రియులు కూడా ఎంతగానో ఎదురుచూస్తారు. అలాంటిది ఒకే ఏడాదిలో అలాంటి దిగ్గజ దర్శకులు సినిమాలతో అలరించబోతున్నారు. నలుగురు స్టార్ హీరోలతో వస్తున్న ఈ సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లు సందడిగా మారనున్నాయి. ఇక ప్రేక్షకుల ముందున్న ఆ ముచ్చటైన సినిమా సంగతుల సమాహారమిది.
రాజమౌళి-మహేశ్‌బాబు.. ‘వారణాసి’
రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో వస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయిలో సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచర్ అడవుల నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖ్యంగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వీరి పాత్రలను కూడా టీమ్ రివీల్ చేసింది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ సుమారు 1200 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సందీప్‌రెడ్డి వంగ-ప్రభాస్.. ‘స్పిరిట్’
స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా సంచలన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని లుక్‌లో చూపించబోతున్నట్టు డైరెక్టర్ సందీప్ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తో వెల్లడయింది. ఈ లుక్ రివీల్ చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఒక శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయబోతున్నట్లు సంక్రాంతి సందర్భంగా సందీప్ రెడ్డివంగా అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది.
‘ఎన్టీఆర్-నీల్’ కాంబో చిత్రం..
కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో సంచలనం సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రంపై ఇండియన్ సినిమా ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం ‘ఎన్టీఆర్-నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ టైటిల్ ఖరారు చేస్తారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్
అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ మూవీ ప్రమాణాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బీవీ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవల ఓ ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘ఏఏ23’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో కనిపిస్తారట. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ ఇదే ఏడాది ఆగస్టులో ప్రారంభం కానుంది. వీటితోపాటు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న సినిమాలెన్నో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.