నేతన్నల అభివృద్ధికి పలు పథకాలు
మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి) : గత పదేళ్లలో చేనేతరంగం అస్తవ్యస్తంగా తయారైందని జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖ దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేనేతలకు పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ. 33.23 కోట్ల నిధులను 10శాతం యార్న్ సబ్సిడీ రూపంలో విడుదల చేసినట్లు తెలిపారు. మగ్గాల ఆధునీకరణకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా రూ.400 కోట్ల బడ్జెట్ వినియోగానికి సీఎం అంగీకరించినట్లు చెప్పారు. టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలుకు ఆదేశాలు జారీ చేసినట్లు, ప్రైవేటు మార్కెట్ నుంచి కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకున్నామన్నా రు. వివిధ శాఖల నుంచి సుమారుగా రూ.255 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
పెట్టుబడి సాయం వృథా కావద్దు..
రైతు భరోసా రూ.15వేలు పెంచుతామని మంత్రి పేర్కొన్నారు. రైతు వేదికలతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడుతూ రైతుబంధు తరహాలో ప్రజాధనం వృథా కాకుండా పటిష్ఠ విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. గతంలో సాగులేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసిందని మండిపడ్డారు. రైతునేస్తం కార్యక్రమంలో సేకరించిన సూచనలను క్రోడికరించి నివేదిక తయారు చేయాలని డైరెక్టర్ గోపిని ఆదేశించారు.






