3 June, 2026 | 1:03 AM

పచ్చునూరులో కరంటోళ్లు లేరు

03-06-2026 12:31 AM

విద్యుత్ సిబ్బంది లేక ఇబ్బంది

మానకొండూరు, జూన్ 2 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామంలో నాలుగు నెలలుగా విద్యుత్ సిబ్బంది లేక ప్రజల వెతలు వర్ణనాతీతంగా మారాయి. గతంలో గ్రామంలో పనిచేసిన లైన్ మెన్ దీర్ఘకాలిక సెలవు పై వెళ్లగా,  లైన్ ఇన్స్పెక్టర్, హెల్పర్ మరణించడంతో కరెంటు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్, మరమ్మతులు చేసేవారు కరువై, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కాలయాపన జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్క గ్రామాల విద్యుత్ సిబ్బందితో అరా కొరగా, మరమ్మతులు చేపట్టినా, పూర్తిస్థాయిలో గ్రామస్తుల కు సేవలందటం లేదు.

గత యాసంగి నుండి, విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయాలు  ఏర్పడుతున్నాయి, ఫ్యూజ్ వైర్ పోయిన, ట్రాన్స్ఫా ర్మర్ల ప్రాబ్లం ఉన్న, జంపర్లు కట్ అయినా, ఏ చిన్న సమస్య వచ్చినా, గ్రామంలో ఏ అధికారికి చెప్పుకోవాలో తెలియక, రైతులు నానా యాతన పడుతున్నారు.  విద్యుత్ సమస్యలు రైతులకు శాపంగా మారాయి. గత ఆరు నెలల క్రితం కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు  (ఎస్ ఎస్ 4 మినీ) (ఎస్‌ఎస్155) నేటికీని మరమ్మతులు కరువయ్యాయి. గ్రామస్తులు ఈ సమస్యలను డివిజన్, జిల్లా స్థాయి విద్యుత్ ఉన్నతాధికారులకు తెలియజేసిన ఫలితం శూన్యమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారుల నిర్లక్ష్య ధోరణి, వైఫల్యం రైతులకు, ప్రజలకు శాపంగా మారాయి. 

వర్షాకాలం సమీపిస్తుండటంతో నారు మళ్ళు దున్నుకోవడానికి, సిద్ధంగా ఉన్నా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు అన్నదాతలను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తున్నాయి.  పంటలను సాగు చేసేది ఎలా అని, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత యాసంగిలో, కరెంటు అంతరాయంతో, నష్టం చవిచూసిన రైతులు, ప్రస్తుతం వర్షాకాలం సైతం  అదే పరిస్థితులు పునరావృతం అయితే, వ్యవసాయం చేసేదెలా అని, విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తున్నారు, వెంటనే కాలిపోయిన  ట్రాన్స్ఫార్మర్లు, తెగిపడి ఉన్న వైర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ విషయంలో సంబంధిత విద్యుత్  అధికారులు చొరవ తీసుకొని, గ్రామంలో విద్యుత్ సిబ్బందిని నియమించి,  రైతుల బాధలను తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే ఈ పరిస్థితి ఉత్పన్నమవడం ఈ ఉదంతంలొ మరో కోస మెరుపు.

ఉన్నతాధికారులకు నివేదించాం

మానకొండూర్ విద్యుత్ ఏ ఈ ఈ,  ఆర్. సత్యనారాయణ పచ్చునూరులో విద్యుత్తు సిబ్బంది లేక ప్రజల సమస్యల  విషయంపై ఉన్నతాధికారులకు నివేదించాం. క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. త్వరలో సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మరోసారి నివేదికలు అందజేస్తాం.