12 August, 2026 | 12:47 AM

రోడ్డు సౌకర్యం లేదు..

12-08-2026 12:01 AM
  1. మురికి నీరే కాబట్టే..
  2. చిమ్మ చీకట్లో కాలం వెల్లదీస్తున్నాం..
  3. మా మొర ఆలకించండి..
  4. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ వద్ద బాధ వెళ్లగక్కిన గిరిజనులు

ఉట్నూర్, ఆగస్టు 11 : మా ఊరికి కనీస సౌకర్యాలు లేవు... నడిచేందుకు దారి లేదు.., నోరు తడుపుకుందామంటే తాగు నీరు లేదు... మరో వైపు పొద్దుగుకితే చిమ్మ చీకట్లనే రోజులు వెళ్లదీస్తున్నాం అంటూ రోది స్తూ జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీవో మంద మకరందంలను వేడుకున్నారు గిరిజనులు.మంగళవారం ఉట్నూర్ మండల కేం ద్రానికి జిల్లా కలెక్టర్ వస్తున్న విషయం తెలుసుకున్న ఉట్నూర్ మండలం దొంగ చింత పంచాయతీ పరిధిలోని మర్కగూడ గ్రామ గిరిజనులు పిఎంఆర్సి భవన కేంద్రానికి చేరుకున్నారు.

అడవి హక్కుల చట్టం సమావేశం ముగించుకొని తిరుగు ప్రయాణమైన జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీవో మంద మకరందంలను మర్కగూడ గ్రామస్తులు కలిసి దొంగచింత పంచాయతీ పరిధిలోని మర్కగూడ గ్రామంలో 20 గిరిజన కుటుంబాలలో 104 చిన్న, పెద్దలం జీవ నం సాగిస్తున్నామనీ, పంచాయతీ కేంద్రం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామానికి ఇప్పటికి రోడ్డు మార్గం లేదని, మట్టి రోడ్డు వేసుకుందామంటే అడవి శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వెళ్లగక్కారు.

తమ గూడానికి ఉన్న బోర్వెల్ బావిలో రంగు మారిన నీరు వస్తుందని, ఆ నీటినే తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామానికి చెందిన కినక కౌసల్యబాయి రోదిస్తూ సమస్యలను వివరించింది. పొద్దు పోతే చిమ్మ చీకట్లనే ఉంటున్నామని, ఐటీడీఏ తరపున ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ పనిచేయడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. చిమ్మ చీకట్లో రాత్రి వేల భయం భయంతో కాలం వెళ్లదీస్తున్నామని, విషపురుగులతో సాహసం చేస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటూ కన్నీటితో తెలిపారు. గిరిజనుల సమస్యలను క్షుణంగా విన్న జిల్లా కలెక్టర్ రాజర్శి షా, పిఓ మంద మకరందులు త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

అక్కడే ఉన్న విద్యుత్ శాఖ ఎస్ ఈ జాదవ్ సుభాష్ ను విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిర్సాయిపేట్ ఎఫ్‌ఆర్‌ఓను రాక పోకలకు రోడ్డు వేసుకునేందుకు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతోపాటు నిధులు మంజూరు చేస్తామని, మట్టి రోడ్డు వేసేందుకు అడ్డంకులు కల్పించొద్దని ఎఫ్‌ఆర్‌ఓకు సూచనలు చేశారు. తాగునీటి సమ స్యను పరిష్కరిస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.