12 August, 2026 | 12:51 AM

విద్యాపర్తికి ఇదేం దుస్థితి?

12-08-2026 12:09 AM
  1. ఓపెన్ డిగ్రీతోనే ముగుస్తుందా..? 
  2. ఓపెన్‌లో ఉన్నత విద్య అందని ద్రాక్షేనా? 
  3. విద్యాపర్తిలో అందని ఓపెన్ పీజీ.. 
  4. ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేస్తున్న విద్యార్థులు  

వనపర్తి, ఆగస్టు 11 (విజయక్రాంతి): వనపర్తి అంటేనే విద్యాపర్తిగా పేరొందిన జిల్లా. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతోపాటు ఉన్నత విద్యకు కూడా జిల్లా కేంద్రం క్రమంగా ఎదుగుతోంది. కానీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతల కారణంగా రెగ్యులర్ కళాశాలల్లో చదువుకోలేని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.

చదువు మధ్యలో ఆగిపోయిన వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న ఓపెన్ డిగ్రీ కోర్సులు ఎంతోమందికి ఉన్నత విద్యకు తొలి మెట్టుగా నిలుస్తున్నాయి. ఉద్యోగం చేసుకుంటూనే, కుటుంబాన్ని చూసుకుంటూనే డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం లభిస్తోంది. అయితే డిగ్రీ పూర్తయిన తర్వాత ఏంటి? అన్న ప్రశ్నకు మాత్రం విద్యార్థులకు స్పష్టమైన మార్గం కనిపించడం లేదు.

ఓపెన్‌లో డిగ్రీ వరకు అవకాశం.. పీజీకి ఎందుకు లేదు? 

ఓపెన్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అదే విధానంలో పీజీ చదివే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వనపర్తి ప్రాంతంలో ఓపెన్ విధానంలో ఉన్నత విద్యను కొనసాగించేందుకు తగిన పీజీ అవకాశాలు అందుబాటులో లేకపోవడంతో చాలామంది విద్యార్థులు డిగ్రీతోనే చదువును నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.

రెగ్యులర్ పీజీ కళాశాలలో చేరేందుకు ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి, ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతో ఓపెన్ డిగ్రీ ద్వారా చదువు కొనసాగించిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు పీజీ దశలోనే ఆర్థిక భారం అడ్డంకిగా మారుతోంది.

విద్యాపర్తికి ఇదేం విరుద్ధ పరిస్థితి? 

వనపర్తికి విద్యాపర్తి అనే పేరు ఉంది. జిల్లాలో విద్యా సంస్థలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అలాంటి ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అందుబాటులో ఉండే ఓపెన్ పీజీ విద్య ఎందుకు అందుబాటులో ఉండకూడదనే ప్రశ్న విద్యార్థులు, విద్యావంతుల నుంచి వినిపిస్తోంది. ఒక విద్యార్థి డిగ్రీ వరకు చేరుకుని ఆ తర్వాత ఆర్థిక కారణాలతో పీజీ చదవలేకపోతే ఓపెన్ విద్య లక్ష్యం ఎంతవరకు నెరవేరినట్లు? డిగ్రీ చదివే అవకాశం కల్పించి, ఉన్నత విద్యకు అవసరమైన తదుపరి మెట్టును అందుబాటులో లేకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి 

వనపర్తిలో ఓపెన్ యూనివర్సిటీకి అనుబంధంగా పీజీ కోర్సులను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యావంతులు కోరుతున్నారు. అవసరమైన అధ్యాపకులు, స్టడీ సెంటర్లు, మౌలిక వసతులు కల్పించి స్థానికంగా ఓపెన్ పీజీ విద్యకు అవకాశం కల్పిస్తే ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.

చదువు మధ్యలో ఆగిపోయిన వారికి డిగ్రీ ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం పీజీ వరకు కొనసాగితేనే ఓపెన్ విద్య అసలు లక్ష్యం పూర్తవుతుంది. వనపర్తి విద్యాపర్తిగా ఎదుగుతున్న తరుణంలో ఓపెన్ డిగ్రీతో విద్యార్థుల ప్రయాణం ఆగిపోవాలా? లేక పీజీ వరకు ఉన్నత విద్యకు ప్రభుత్వం బాటలు వేయాలా? అనేది ఇప్పుడు పాలకులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని వనపర్తి మేధావులు అంటున్నారు.