16-09-2025 01:07:05 PM
ఎఫ్ ఆర్ ఓ పూర్ణచందర్ స్పష్టం..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిలోని కాసిపేట, దేవాపూర్, బెల్లంపల్లి బుగ్గ, మాదారం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉందని బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి పూర్ణచందర్(Forest Range Officer Poorna Chander) వెల్లడించారు. పెద్దపులి సంచారంపై విజయక్రాంతికి స్పష్టత ఇచ్చారు. గత కొంతకాలంగా అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి కదలికలు కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన బి-1 పెద్దపులి భూపాలపల్లి అడవుల వైపు వెళ్లిపోయిందని తెలిపారు. ప్రస్తుతం రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులిని తిర్యాణి టైగర్ గా చెబుతున్నామన్నారు. అటవీ రేంజ్ పరిధిలోని బుగ్గ గూడెంలో 2, ముత్యంపల్లిలో 1, మాదారం అటవీ ప్రాంతంలో 3 నుండి 4 వరకు చిరుతపులులు సంచరిస్తున్నట్లు తెలిసిందన్నారు. చిరుతపులల నుండి పెద్దగా ప్రమాదం లేకపోయినప్పటికీ అడవి మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు, అటవీ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.