calender_icon.png 16 September, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం 9వ వర్ధంతి

16-09-2025 01:48:33 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల నాయకులు బొజ్జా తారకం 9 వర్ధంతి నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు మాట్లాడుతూ, అణగారిన ప్రజల ఆశాజ్యోతి, దళిత, పౌర హక్కుల నాయకుడు, ప్రజా న్యాయవాది, రిపబ్లికన్ పార్టీ నాయకుడు, కవి, రచయిత, గొప్ప వక్త బొజ్జా తారకం మన నుంచి భౌతికంగా దూరమై తొమ్మిదేళ్ళు దాటింది. ఇంకా ఆయన స్ఫూర్తి సమాజంలోని పీడిత ప్రజల ప్రేమికులకు, ప్రగతిశీల శక్తులకు బాసటగా నిలుస్తూనే ఉంది. బొజ్జా తారకం 1939 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా కందికుప్ప గ్రామంలో బొజ్జా అప్పలస్వామి-మావుళ్ళమ్మ దంపతులకు కనిష్ఠ పుత్రుడిగా జన్మించారు. ‘‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా ప్రజానీకానిది’’ అని కవి కాళోజీ అన్నట్లుగా బొజ్జా తారకం విద్యార్థి దశ నుంచి తుదిశ్వాస విడిచే వరకు పీడిత ప్రజల అభివృద్ధి కోసమే పోరాడి ఒక ఉజ్వల చరిత్రను మన కళ్ల ముందు నిలిపారని అన్నారు. అంబేద్కర్ నగర్ మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ జిల్లా నాయకులు కంసాల మల్లేశం, వేములవాడ దళిత సంఘాల నాయకుడు లింబాద్రి, సిరిగిరి నవీన్ పాల్గొన్నారు.