16 July, 2026 | 8:48 AM

ఒక్కచోట లీకైతే నష్టమేంలేదు

21-06-2024 01:40 AM
  • నీట్ పేపర్ లీక్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  • బీహార్‌లో పేపర్ లీక్‌పై స్పష్టమైన ఆధారాలు
  • అధికార ప్రతిపక్ష పార్టీల పరస్పర ఆరోపణలు
  • ఏమీ పట్టనట్టుగా ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం
  • లీకేజీ స్పష్టమైనా పరీక్ష రద్దుకు సుప్రీం ససేమిరా

న్యూఢిల్లీ, జూన్ 20: నీట్ పేపర్ లీక్‌పై అధికార, విపక్ష నేతలు కత్తులు దూసుకొంటున్నారు. వరుసగా రెండు పరీక్ష పేపర్లు లీక్ కావటంపై ప్రభుత్వంపై ఇండియా కూటమి నేతలు ముప్పేట దాడి చేస్తుండగా, బీజేపీ నేతలు కూడా అందుకు కౌంటర్లు వేస్తున్నారు. నిన్నటివరకు నీట్ పేపర్ లేక్ కాలేదని వాదించిన కేంద్రం.. బీహార్‌లో పేపర్ లీక్ నిజమేనని గురువారం ఒప్పుకొన్నది. ఒక్కచోట పేపర్ లీకైనంత మాత్రాన ఏమీ కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించటం గమనార్హం. మరోవైపు పేపర్ లీకైనట్టు ఆధారాలున్నా సుప్రీంకోర్టు నీట్ కౌన్సిలింగ్ యథావిధిగా జరుగుతుందనే ప్రకటించింది. పరీక్ష పేపర్ల లీకేజీలను అరికట్టడంలో ప్రధానమంత్రి పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. 

బీహార్‌లో స్పష్టమైన ఆధారాలు 

కేంద్రప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తిరస్కరిస్తున్నప్పటికీ నీట్ పేపర్ లీకైనట్టు స్పష్టమైన ఆధారాలు బయటపడుతు న్నాయి. బీహార్‌లో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతున్నది. రాష్ట్రంలో నీట్ లీక్ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేశారు. ఇందులో పేపర్‌ను లీక్‌చేసిన ముఠాతోపాటు పేపర్‌ను కొనుగోలు చేసిన విద్యార్థులు, వీరందరినీ సమన్వయం చేసిన ప్రభుత్వ విభాగంలోని ఓ జూనియర్ ఇంజినీర్ కూడా ఉన్నారు. తాజా ఈ ముఠాకు రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి.

ఈ కేసులో అరెస్టయిన అనురాగ్ యాదవ్ అనే విద్యార్థి తనకు ఓ మంత్రి స్వయంగా తన లెటర్ హెడ్‌పై నీట్ పేపర్ కోసం రికమెండేషన్ లెటర్ రాసిచ్చాడని బుధవారం పోలీసులకు తెలిపాడు. దీంతో నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు ప్రభుత్వం గురువారం కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ సన్నిహిడికి కూడా ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్‌సిన్హా గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు.  పేపర్ లీక్‌లో ప్రధాన నిందితుడైన కికందర్ యదువేంద్రకు హోటల్ రూము బుక్ చేసింది తేజస్వీ యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ అని మీడియా సమావేశంలో విజయ్ సిన్హా తెలిపారు. వీరిద్దరి మధ్య తరుచూ ఫోన్ సంభాషణలు కూడా జరిగాయని ఆరోపించారు.  

పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకు

నీట్ లీకేజీపై దేశవ్యాప్తంగా అనేక హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావటంతో సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకొన్నది. అన్ని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై విచారణ నిలిపివేసి తమకు పంపాలని ఆదేశించింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం నీట్‌పై దాఖలైన పిటిషన్లను గురువారం విచారించింది. నీట్‌పై ఏడు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయని, వాటన్నింటినీ కలిపి సుప్రీంకోర్టులో విచారించాలని ఈ సందర్భంగా ఎన్టీఏ కోరింది. దీంతో ఆయా హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు జారీచేసింది. నీట్ పరీక్షను రద్దుచేయాలని సుప్రీంకోర్టులో కూడా 14 పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ కౌన్సిలింగ్‌ను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని విద్యార్థుల కోరగా, న్యాయస్థానం అందుకు ఒప్పుకోలేదు. గతంలో ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడి ఉన్నామని తెలిపింది. 

పరీక్ష ముందు రోజు రాత్రే అందిన ప్రశ్నలు

బీహార్‌లో అరెస్టయిన విద్యార్థులు పోలీసుల విచారణలో సంచనల విషయాలు బయటపెట్టారు. మే 5న నీట్ పరీక్ష నిర్వహించగా, మే 4వ తేదీ రాత్రే తమకు నీట్ పేపర్‌లోని ప్రశ్నలు అందినట్టు అంగీకరించారు. అయితే, పేపర్ ముందుగా అందినప్పటికీ వారు మంచి స్కోర్ సాధించలేకపోయారని వారి స్కోర్ కార్డులనుబట్టి తెలుస్తున్నది. తన బంధువు, ప్రభుత్వ జూనియర్ ఇంజినీర్ సికందర్ యదువేందు తనకు నీట్ ప్రశ్నలు అందించాడని అనురాగ్ యాదవ్ అనే విద్యార్థి తెలిపాడు.