నేటి నుంచి భద్రకాళీ భద్రేశ్వర బ్రహ్మోత్సవాలు
వరంగల్, మే 9 (విజయక్రాంతి): వరంగల్ భద్రకాళీ దేవస్థానంలో శుక్రవారం నుంచి భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవ వేడుకలు జరుగనున్నాయి. పది రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా గురువారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు చీరెలు, పూజాద్రవ్యాలు సమర్పించారు. అర్చకులు ఉదయం గణపతి పూజా పుణ్యాహవాచనం, నాంది, విడాహవాచనం, బ్రహ్మకూర్చ హోమం, పంచగవ్య ప్రాసన, రుత్విగ్వరణం, మధుపర్క విధి జరిపి వాస్తు యాగం పర్యగ్ని కరణం, మృత్సంగ్రహణం, ధ్వజాదివాస కార్యక్రమాలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కటకం పెంటయ్య, కొండ దేవయ్య, కనకట్ల రవికుమార్, రాజ్‌కుమార్, శ్రీధర్, కుమారస్వామి, శ్రీనివాస్, సత్యనారాయణ, మనోజ్, వరుణ్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.






