ఈ యేడు మెగాఫోన్ పట్టిన నవతరం సిత్రాలు!
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో నవ దర్శకులే ముందుంటారు. అందుకే ప్రేక్షకుల కళ్లూ వారిపైపే చూస్తుంటాయి. పాత నీరు పోయి, కొత్త నీరు రావడం అవసరం అయినట్టే సినీ పరిశ్రమకూ కొత్త దర్శకుల రాక చాలా ముఖ్యం. సినిమాకు నవ జవసత్వాలు నింపేది యువ డైరెక్టర్లే. ఓ కొత్త దర్శకుడు తనదైన మార్క్‌తో నిలబడితే సినిమాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కథలు చెప్పడంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త దర్శకులపై పెద్ద అంచనాలు ఉండవు కాబట్టి వైవిధ్యమైన థీమ్స్, జోనర్స్, ఫిలిం మేకింగ్‌లో యూనిక్ స్టుల్‌ను ప్రయత్నించే అవకాశం కూడా వారికే ఉంటుంది. ఈ ఏడాది కూడా తెలుగునాట కొత్త దర్శకులు సందడి కనిపించింది. పలువురు యువ దర్శకులు తమ తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుంటే మరికొందరికి నిరాశ ఎదురైంది.
నాగర్జున లాంటి సీనియర్ హీరో ‘నా సామిరంగ’తో కొరియోగ్రఫర్ విజయ్ బిన్నీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ఏడాది ఆరంభంలో సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ‘అంబా జీపేట మ్యారేజ్ బ్యాండ్’తో దర్శకుడిగా పరిచయమయ్యారు దుష్యంత్ కటికినేని. కుల వివక్ష బ్యాక్ డ్రాప్‌లో కథను రాసుకున్న ఆయన సాధ్యమైనంత సహజంగా చెప్పే ప్రయత్నం చేశారు.
వీ యశస్వి తెరకెక్కించిన ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమాకు ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ సినిమా లతో పోలికలు వచ్చాయి. ఒక రకమైన ఫిలాసఫీతో కథ చెప్పాలని అనుకోవడం కొత్త ప్రయత్నమే. ‘సుందరం మాస్టర్’తో కళ్యాణ్ సంతోష్ మెగాఫోన్ పట్టుకున్నారు. కొత్త యాంబియన్స్, బ్యాక్‌డ్రాప్‌లో కథను సెట్ చేశారు. పురుషోత్తం రాజ్ తీసిన క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. బ్యాక్‌డ్రాప్‌ను కొత్తగానే సెట్ చేశారు.
‘గామి’తో విద్యాధర్ కాగిత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.కోన వెంకట్ అన్నీ తానై నడిపిన సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి అనే కొత్త దర్శకుడికి డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారు కోన. ఇదొక సీక్వెల్. ఈ కారణంగా దర్శకుడిగా శివ మార్క్ ఏమిటో తెలిసిరాలేదు. కథ కథనంలో పెద్ద కొత్తదనం కనిపించలేదు. సుహాస్, రుహాని, శర్మ, కార్తీక రత్నం, విరాజ్ అశ్విన్ ఇలా యంగ్ యాక్టర్స్‌తో ‘శ్రీరంగ నీతులు’ సినిమా చేసిన ప్రవీణ్‌కుమార్ పర్వాలేదనిపించాడు.
సుకు మార్ శిష్యుడు అర్జున్ వైకే ‘ప్రసన్న వదనం’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా స్క్రీన్ ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ‘ఆరంభం’తో దర్శకత్వం ప్రారంభించిన అజయ్ నాగ్ మంచి పేరు తెచ్చుకున్నారు. థియేటర్ల ఆదరణ లభించలేదు కానీ ఓటీటీలో చూసిన వారంతా కొత్త కాన్సెప్ట్‌ను లిమిటెడ్ బడ్జెట్‌తో చాలా క్యాలిటీతో తీశారని అభినందించారు.
గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమాతో తనలో ఓ ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడని నిరూపించుకున్నాడాయన. హీరో కార్తికేయ ‘భజే వాయువేగం’తో కొత్త దర్శకుడు ప్రశాంత్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. రేసీ స్క్రీన్ ప్లేతో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ చూసిన వాళ్లందరికి ప్రశాంత్‌లో యాక్షన్ ఫిల్మ్ మేకర్ కనిపించాడు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాతో శివ పాలడుగుకు మంచి మార్కులే పడ్డాయి.
తను ఎంచుకున్న కథ, ఆ కథని చెప్పిన విధానం ఆకట్టుకున్నాయి. ‘పేకమేడలు’తో నీలగిరి మామిళ్ల ఒక రియలెస్టిక్ కథను అంతే సహజంగా చెప్పే ప్రయత్నం చేశారు. ‘బర్త్‌డే బాయ్’తో విస్కీ దాసరి తీసిన థ్రిల్లర్ ఓ కొత్త ప్రయత్నమే. ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రం ‘ఆయ్’. కొత్త దర్శకుడు అంజి కే మణిపుత్ర తీసిన ఈ సినిమా కమర్షియల్‌గా భలే వర్క్ అవుట్ అయ్యింది.
విలేజ్ బడ్డీ కామెడీని దర్శకుడు అంజి డీల్ చేసిన విధానం అందరినీ అలరించింది. నిజానికి ఈ సినిమా కోసం అంజి ఎంచుకున్న ఇతివృత్తం సున్నితమైనది. ఇలాంటి అంశాన్ని ఫ్రెండ్‌షిప్‌తో ముడిపెట్టి ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశారు అంజి. ‘అలనాటి రాంచంద్రుడు’తో చిలుకూరి ఆకాశ్‌రెడ్డి చేసిన ప్రేమకథ పర్వాలేదనిపింది. అయితే దర్శకత్వంలో ప్రేమ, భావోద్వేగాలతోపాటు బలమైన ఎమోషన్స్‌తో సాగిన ఈ సినిమాలో బరువైన ప్రేమకథే ఉంది. ఎమోషనల్‌గా సాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగున్నాయి.
అయితే, దర్శకుడి పనితనం సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ కథ కథనాల్లో కొత్తదనం లేదన్న అభిప్రాయయాన్ని సినీ విమర్శలు వ్యక్తం చేశారు. సుహాస్‌తో సందీప్‌రెడ్డి బండ్ల తీసిన ‘జనక అయితే గనక’ కాన్సెప్ట్ మెప్పించింది కానీ ఎంగేజింగ్ డ్రామా కుదరలేదు. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాతో యదువంశీ దర్శకుడిగా తన మార్క్ చాటుకున్నారు. తొలి ప్రయత్నంలోనే చాలా క్యారెక్టర్స్‌ను డీల్ చేసి ఆయన చెప్పిన ఓ పల్లెటూరి జాతర కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది.
క్లుమైక్స్‌లో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా మరింత మంచి ఫలితం చూసేది. ‘క’ సినిమాతో కొత్త ఆశలు రేపింది దర్శక ద్వయం సుజిత్ టాలీవుడ్‌లో ఇప్పటివరకూ పెద్ద టచ్ చేయని కర్మ సిద్ధాంతం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకొని ఈ ఇద్దరు డైరెక్టర్లు తీసిన ‘క’ కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఒక ఫిలాసఫీని కూడా ఇంత ఎంగేజింగ్‌గా చెప్పవచ్చనే ఆలోచన రేకెత్తించేలా సినిమాను తెరకెక్కించారు.
కమర్షియల్‌గా కూడా సినిమా వర్క్ అవుట్ అయ్యింది. ఈ ఏడాది యునానిమస్‌గా విమర్శకులు ప్రశంసలు పొందిన సినిమా ‘35 చిన్న కథ కాదు’. ఒక మామూలు పాయింట్ ని ఎంత ఇంపాక్ట్ ఫుల్ గా తీయొచ్చు దర్శకుడి నందకిశోర్ ఈమని చూపించారు. అందరూ రిలేట్ అయ్యే కథను మనుసును హత్తుకునేలా చెప్పారు. గణితంలో జీరోతో కుస్తీ పడే ఓ పిల్లాడు, ఆ పిల్లాడి కోసం తల్లితండ్రులు ఆరాటం, స్కూల్, స్నేహితులు, భార్యాభర్తల బంధం.. ఇలా కథలో తను టచ్ చేసిన ప్రతి అంశం మెప్పించింది.
కొత్త దర్శకులకు విశ్వక్, సుధీర్‌బాబు లాంటి ఇమేజ్ ఉన్న హీరోలు దొరకడం ఒక బలమే. అయితే సుధీర్‌బాబుతో అభిలాష్‌రెడ్డి తీసిన ‘మా నాన్న సూపర్ హీరో’, విశ్వక్‌తో రవితేజ ముళ్ళపూడి తీసిన ‘మెకానిక్ రాకీ’ అంత ప్రభావాన్ని చూపలేదు.






