15-09-2025 07:11:50 PM
బెల్లంపల్లి అర్బన్: అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని కోరుతూ సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి తహసిల్దార్ కృష్ణ(Tehsildar Krishna)కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ. 4000 నుండి రూ. 6000/- పెంచుతామని, అలాగే వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ. 2000/-నుండి రూ. 4000/- పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారన్నారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీ చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదనీ ఆరోపించారు. ఇది ఘోరమైన మోసమని విమర్శించారు. కనుక ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పెంచాలని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మచ్చ రాజేష్, చంద్రశేఖర్, కుమ్మరి శ్రీనివాస్, నాతరి శివ, జాఫర్, ఎలిగేటి తిరుపతి, హనుమాన్ల మధు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు పాల్గొన్నారు.