15-09-2025 07:44:47 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి మండలం పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా కోసం లైన్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్థలం కోసం సమగ్ర సర్వే చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా లైన్ ఏర్పాటు విషయంపై డీఎఫ్ఓ అరవింద్ ప్రసాద్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి మండలం పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా కోసం లైన్ ఏర్పాటు చేసేందుకు ఎంత మేర స్థలం అవసరం అవుతుందని విద్యుత్ అధికారులను ఆరా తీశారు.
లైన్ వెళ్లే మార్గంలో అటవీ స్థలం ఎంత ఉంది, ఇతర భూమి ఎంత మేర ఉంటుందని ఆరా తీశారు. ఇందుకు సంబంధించి రెవిన్యూ, అటవీ అధికారులు సంయుక్తంగా సమగ్ర సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే అనంతరం కావలసిన స్థలానికి సంబంధించి లొకేషన్ మ్యాప్, నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు. అయితే లైను ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ అధికారులు అవసరం మేరకే ఒక పద్ధతి ప్రకారం కొమ్మలను తొలగించాలని కలెక్టర్ సూచించారు. కొమ్మలను తొలగించే ముందు అటవీ అధికారులకు సమాచారం అందించాలని తెలియజేశారు. సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, విద్యుత్ శాఖ ఎస్ఈ రాజశేఖర్, ఇ సెక్షన్ సూపర్డెంట్ సునీత, జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.