దొంగల్లాగ పోతున్నరు
- పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ అధినేత ఆగ్రహం
- ఒకరు పోతే పదిమందిని నేతలను తయారుచేస్తా
- బీఆర్‌ఎస్‌కు ఇలాంటి పరిస్థితులు లెక్క కాదు
- పారిపోయిన దొంగల గురించి ఆలోచించొద్దు
- తెలంగాణ ప్రగతిలో చాలా మైలురాళ్లు చేరుకోవాలి
- జగిత్యాల, నిజామాబాద్ కోరుట్ల కార్యకర్తల భేటీలో కేసీఆర్
హైదరాబాద్/నిజామాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు చాలా ఉన్నాయని, ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉందని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక నాయకుడు పోతే పది మంది నాయకులను పార్టీ తయారు చేస్తుందని పునరుద్ఘాటించారు. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన స్వరాష్ట్రం సాధించుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్క కాదని అన్నారు.
పార్టీ నుంచి పారిపోయి దొంగల్లా కాంగ్రెస్ నాయకులను కలుస్తున్న వారి గురించి ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మను అర్ధం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించే సత్తా ఉద్యమం నడిపించి రాష్ట్రం సాధించిన బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని కార్యాలయంలో కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో సమావేశమై వారికి కేసీఆర్ ధైర్యం చెప్పారు.
అబద్ధాలు నమ్మి బోల్తాపడ్డ ప్రజలు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలు నమ్మి ప్రజలు బోల్తాపడ్డారని కేసీఆర్ అన్నారు. ‘మనం రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉంది. ప్రజలు అవకాశమిస్తే 10 సంవత్సరాలు చిత్తశుద్ధితో ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా పనిచేసి ప్రగతి సాధించి ప్రజల మన్ననలు పొందినం. కుల మతాలకతీతంగా పనిచేసి వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరిచి అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాం. కుల వృత్తులను అభివృద్ధి చేసి గ్రామ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాం. అయితే కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాన్ని నమ్మి ప్రజలు బొల్తా పడుతారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. అంతమాత్రాన నిరుత్సాహపడవద్దు. అధికారం ఉంటే పనిచేస్తామనటం పద్ధతి కాదు. మనం ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందే.
అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమే. ఇంకా నెరవేరాల్సిన ప్రజల కలలను మనం మాత్రమే నెరవేరుస్తాం. ఆనాడు మనం ఉద్యమాలకు దిగినప్పుడు మనతో ఎవరు ఉన్నారని.. నాడైనా, నేడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే. మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పార్టీని వీడి దొంగల్లో కలిశాడు. అందుకు బాధపడేదేమీ లేదు. ఆయనను తయారు చేసింది గులాబీ పార్టీనే అన్న సంగతి మరిచిపోవద్దు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేడు. మధ్యలో వచ్చినవారు మధ్యలో వెళ్లిపోతారు. మీలోనే మంచి నేతను తయారు చేస్తా. మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుంది’ అని తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే కే సంజయ్‌కుమార్ ఒకపక్క డాక్టర్‌గా, మరోపక్క ఎమ్మెల్యేగా ప్రజా సేవ అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అభినందించారు.
కేసీఆర్‌ను కలిసిన ఇందూరు నేతలు
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేతలు శుక్రవారం సమావేశం అయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేము ల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కామారెడ్డి జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హునుమంత్ షిండే చేరుకున్నారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ ఎస్ పార్టీ పరిస్థితిపై చర్చించారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరటంతో జిల్లాలో పార్టీ పటిష్ఠానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు నా యకులు, క్యాడర్‌ను కాపాడుకోవటానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఓటమి తర్వాత తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు చేయాల్సిన వ్యూహరచనపై సలహాలు ఇచ్చారు. పార్టీని పటిష్ఠం చేసే విషయంలో నాయకత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
సమావేశాలకు మూడు రోజుల విరామం
గత 15 రోజుల నుంచి సాగుతున్న ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల పాటు విరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశాలు జరిపారు. రెండు వారాల నుంచి నియోజకవర్గాలవారీగా నాయకులను కలుస్తూ పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తనను చూసేందుకు వస్తున్న ప్రజలతో ఓపికతో గంటల పాటు నిలబడి కేసీఆర్ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఫొటోలు దిగుతున్నారు.






