చిట్కుల్ చెరువు విషతుల్యం 15 టన్నుల చేపలు మృత్యువాత
- రూ.2 కోట్ల మేర నష్టం.. ఆందోళనలో మత్స్యకారులు
పటాన్‌చెరు, జూన్ 28: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని 200 ఎకరాల్లోని చిట్కుల్ చెరువు విషతుల్యమై మూడు రోజుల్లో 15 టన్నుల చేపలు మృత్యువాత పడటం కలకలం రేపుతున్నది. చేపలు ఎదిగాయి.. ఇక వేట ప్రారం భిద్దామని మత్స్యకారులు భావిస్తున్న తరుణంలో చెరువు విషతుల్యం కావడం మత్స్యకారులకు తీరని నష్టం వాటిల్లింది. సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లిందని బాధితులు తెలుపతున్నారు. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022 సెప్టెంబర్‌లో మత్య్సశాఖ అధికారులు 1.2 లక్షల చేప పిల్లలు చెరవులో వదిలారు. అలాగే ఇదే ఏడాది మత్స్యకారులు సొంతంగా రూ.13 లక్షల నిధులు సమకూర్చుకుని 11 లక్షల చేప పిల్లలను వదిలారు.
చెరువులో గుర్రపు డెక్కను తొలగించేందుకు మరో రూ.28 లక్షలు ఖర్చు చేశారు. చేపలు ఎదిగిన నేపథ్యంలో ఇక వేట ప్రారంభించేందుకు మత్స్యకారులు ఏర్పా ట్లు చేసుకుంటుండగా సోమ వారం వర్షం కురిసింది. ఇస్నాపూర్, పాశమైలారం పారిశ్రామిక వాడ నుంచి భారీగా వరద నీరు చెరువులోకి కొట్టుకువచ్చింది. దీంతో చెరువు విషతుల్యమైంది. మంగళవారం ఉదయం నాటికి వందలాది కిలోల చనిపోయిన చేపలు చెరువు ఒడ్డున కనిపిం చాయి. సమాచారం అందుకున్న మత్స్యశా ఖ అధికారులు చెరువును పరిశీలిం చారు.
వరుసగా బుధ, గురువారం నాటి చనిపోయిన చేపల సంఖ్య 15 టన్నులకు చేరింది. మత్స్యశాఖ అధికారులు చెరువు నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. చెరువులో ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో చేపలు మృతిచెందాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కానీ ల్యాబ్ నిపుణు లు మాత్రం ఈ అభిప్రాయాన్ని తోసిపుచ్చుతున్నారు. రసాయ నాలతో నీరు విషతుల్యమై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
చెరువును పరిశీలించిన అదనపు కలెక్టర్
చిట్కుల్ చెరువును శుక్రవారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మత్స్యశాఖ ఏడీ సతీశ్ పరిశీలించారు. చేపల మృతిపై సమగ్ర విచారణ చేయిస్తామని మత్స్యకారులకు తెలిపారు. ఈసందర్భంగా మత్స్యకారులు తమ గోడును వెల్లబోసుకున్నారు. చేపలు మృతిచెందడంతో సుమారు రూ.2 కోట్ల మేరకు నష్టపోతున్నామని, అధికారులు దయచూపి తమను ఆదుకోవాలని అదనపు కలెక్టర్‌ను కోరారు.






