12-02-2026 01:03:46 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి11 ( విజయకాంత్): కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కు నే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థుల కష్టాలు, ఉస్మా నియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు మీడి యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీఓయూ అధ్యక్షుడు గెల్లు శేఖర్, కార్యదర్శి మోక్షిత్ మాట్లాడుతూ గతంలో ఓయూ బహిరంగ సభలో ఓయూ కి 1000 కోట్లు ఇస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, అయితే ఇప్పటి వరకు ఆ నిధులో వేయి కోట్లు కాదు కదా. వేయి పైసలు కూడా విడుదల కాలేదన్నారు.
గారడీ మాటలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కన్ను 1500 కోట్ల ఓయూ డిపాజిట్‌ల మీద పడిందని ఆరోపించారు. ఓయూ డిపాజిట్లు 1500 కోట్లలో 1000 కోట్లు ఓయూకే ఇచ్చి మిగిలిన 500 కోట్లు కాజేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. 13 సంవత్సరాలనుంచి బోధన, బోధనేతర సిబ్బం ది నియామకం చేయక పోవడంవల్ల గ్రామీణ ప్రాంతం నుంచి ఓయూకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందన్నారు.
ఓయూ భూముల పరిరక్షణ కొరకు ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్టును తీసుకొచ్చి,ఆ భూము లను సర్వే చేయించి ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వితేజ, స్టేట్ జాయింట్ సెక్రెటరీ అలివేలి రాజు, విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరిప్రసాద్, స్టేట్ ఖేల్ కో కన్వీనర్ శివశంకర్, దినేష్, ప్రియా తదితరులు పాల్గొన్నారు.