15 June, 2026 | 3:37 AM

కాంగ్రెస్‌ను తరిమికొడతారు

15-06-2026 02:11 AM
  1. పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి ద్రోహం 
  2. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డికి ఓటమి తప్పదు
  3. ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశంలో కేటీఆర్ 

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని మహబూబ్‌నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని, రేవంత్‌రెడ్డికి కొడంగల్‌లో ఓటమి ఖామయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి నివాసంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపుగా పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరందకుండా సీఎం రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకువెళ్తూనే, గత ప్రభుత్వ హయాంలో మనం చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని సూచించారు.

60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు అందకుండా ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలు అందకుండా వెనుకబాటు జిల్లాగా చేసిన ద్రోహం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొనసాగిస్తున్నదన్నారు. నేతలకు రానున్న ఎన్నికలకు సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి పలు అంశాలపైన దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో బీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.