27-10-2025 09:12:14 PM
వరుస దొంగతనాలతో బెంబెలెత్తిపోతున్న మండల ప్రజలు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. పోలీసులు విజ్ఞప్తి..
నకిరేకల్ (విజయక్రాంతి): వరుస దొంగతనాలతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. వరుస దొంగతనాలతో మండల ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. కొన్ని రోజుల క్రితమే ఓ మహిళకు బైక్ లిఫ్ట్ ఇచ్చి మార్గమధ్యలో ఆపి మహిళపై ఐరన్ రాడ్డుతో దాడి చేసి ఐదు తులాల బంగారం దొంగిలించిన ఘటన మరువకముందే ఆదివారం రాత్రి పెరిక కొండారం గ్రామాంలో గంట రాజు ఇంట్లో అర్ధరాత్రి దొంగతనం ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలంలోని పెరిక కొండారం గ్రామానికి చెందిన గంట రాజు సునీతల కూతురు మన్నే శిరీష గత సంవత్సర కాలం నుండి ప్రెగ్నెన్సీ డెలివరీ కోసం తన పుట్టింటిలో ఉంటున్నది.
ఆదివారం రాత్రి భోజనానంతరం గంట సునీత ఆమె కూతురు శిరీష కలిసి ఇంట్లో తలుపు దగ్గర గడీలు వేయకుండా నిద్రించారు. గంట రాజు ఇంటి ఆరుబయట నిద్రించడంతో ఇదే అదును చేసుకొని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంటి గడి వేయకుండా నిద్రిస్తుండగా గుర్తుతెలియని దొంగ తలుపులు తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించి బ్లేడుతో శిరీష మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును బ్లేడుతో కత్తిరించి దొంగిలించుకుని దోంగ వెళ్తున్న సమయంలో గంట సునీత యొక్క కాలికి తగలడంతో ఆమె నిద్ర నుండి మేల్కొని గట్టిగా అరుస్తు అతనిని అడ్డుకోబోవుచుండగా అట్టి దొంగ ఆమెను నెట్టివేసి ఇంటి గోడ దూకి పారిపోయినట్లు తెలిపారు. ఆమె అరుపులు విన్న భర్త రాజు నిద్రలేచి ఆ దొంగ వెంట వెంబడించగా అతడు దొరకకుండా పారిపోయినట్లు పేర్కొన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శాలిగౌరారం ఎస్ఐ సైదులు తెలిపారు.