గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి
ప్రాంతీయ అభివృద్ధికి మండల కేంద్రం ఎంతో కీలకం
బహుజన ప్రజా సమితి డిమాండ్
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని బహుజన ప్రజా సమితి (బీపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు గొట్టిపర్తి నూతన మండల కేంద్రం ఏర్పాటు సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు బీపీఎస్ అధ్యక్షుడు అడ్వకేట్ చింతకుంట్ల హరిబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గొట్టిపర్తి మండల కేంద్రంగా ఏర్పాటైతే పరిసర గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు.
జలాల్ పురం, రావులపల్లి తండా, రాఘవపురం, రావులపల్లి, గొట్టిపర్తి, మామిడాల, మానాపురం తండ తదితర గ్రామాల ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నూతన మండల కేంద్రం ఏర్పాటుతో మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, ఆసుపత్రి, విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా వారాంతపు అంగడి ఏర్పాటుతో పాటు కొత్త దుకాణాలు, వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
కొత్త రహదారుల నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని, భూముల విలువ పెరగడంతో పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ఇతర నిత్యావసరాలు స్థానికంగానే లభించే అవకాశం ఉంటుందని అన్నారు. గొట్టిపర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం కేవలం పరిపాలనా సౌకర్యం మాత్రమే కాదు.
చుట్టుపక్కల గ్రామాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే నిర్ణయం అని బహుజన ప్రజా సమితి నాయకులు పేర్కొన్నారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం గొట్టిపర్తి నూతన మండల కేంద్రం ఏర్పాటు సాధన కమిటీ ఆధ్వర్యంలో నేడు గొట్టిపర్తి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు, యువత, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.






