20 June, 2026 | 2:37 AM

విజువల్‌గా గొప్ప అనుభూతినిచ్చే చిత్రమిది

20-06-2026 12:26 AM

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం : ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటించగా.. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, మురళీశర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెం ట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ.. “విజువల్‌గా, సాంకేతికంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది” అని చెప్పారు. ‘మన పురాతన ఆలయాలు, వాటి వెనుక రహస్యాలు, చరిత్రను ముందు తరాలకు తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంద’ని హీరో విరాట్ కర్ణ తెలిపారు.

హీరోయిన్ నభా నటేశ్ మాట్లాడుతూ.. “నాగబంధం’ మన సనాతన ధర్మం, చారిత్రక అంశాలను అద్భుతంగా ఆవిష్కరించిన విజువల్ స్పెక్టాకిల్. ఇలాంటి ఎపిక్ కథలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు. ‘మేమంతా అభిషేక్ విజన్‌ను నమ్మి ఈ ప్రయాణంలో భాగమయ్యాం’ అని ఐశ్వర్య మీనన్ చెప్పారు. ‘ఈ సినిమా ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేస్తుంద’ని నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి తెలిపారు.

నిర్మాత నిశిత నాగిరెడ్డి మాట్లాడుతూ.. “నాగబంధం’ మన నాగరికత వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రయత్నం అని నేను భావిస్తున్నా. ఈ ప్రయాణం మా అదృష్టంగా భావిస్తున్నా” అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు అబి  జునైద్, డీవోపీ సౌందర్ రాజన్ కూడా మాట్లాడారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు.