calender_icon.png 24 February, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవిష్ణు కెరీర్‌లో టాప్ ఫైవ్‌లో నిలిచే చిత్రమిది

24-02-2026 12:21:33 AM

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జీ నిర్మించారు. ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు, సుమంత్ నాయుడు విలేకరులతో పంచుకున్నారు.  “-కామెడీ కథలు విన్నప్పుడు కంటే స్క్రీన్ మీదనే అర్థమవుతుంది.

అప్పుడే కథలో ఉన్న వినోదం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మా వరకు ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో సినిమా చూసినప్పుడు కూడా అంతకుమించి ఆస్వాదించాం. సినిమా చాలా బాగా వచ్చింది. విష్ణు చాలా డైలాగులను స్పాట్‌లో ఇంప్రవైజ్ చేస్తుంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ‘విష్ణు విన్యాసం’, ‘మృత్యుంజయ్’.. రెండు సినిమాలు ఒకేసారి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వన్ వీక్ గ్యాప్‌లో ముందుగా కామెడీ ఎంటర్‌టైనర్, తర్వాత థ్రిల్లర్ జానర్ సినిమా తీసుకురావాలని సన్నాహాలు చేశారు.

ఈ విషయంలో -హీరో శ్రీ సపోర్టు మర్చిపోలేం. రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు కావడంతో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ‘విష్ణు విన్యాసం’ హీరో క్యారెక్టర్ మీద నడిచే కథ. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ ట్రాక్ ఉంటుంది. హీరో క్యారెక్టర్‌కు న్యూమరాలజీ అంటే నమ్మకం. అలాగే హీరోయిన్ ట్రాక్, రెండు కుటుంబాల కథ కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇందులో హీరో పేరు విష్ణు. అందుకే సినిమాకు ‘విష్ణు విన్యాసం’ అని టైటిల్ పెట్టాం.

-ఒక మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారని మేము నమ్ముతాం. సంక్రాంతి తర్వాత సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. మా ‘విష్ణు విన్యాసం’ చూసిన ప్రేక్షకులు చిరునవ్వుతో థియేటర్ల నుంచి బయటికి వస్తారు. శ్రీవిష్ణు కెరీర్‌లో టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమాతో ఆయన సక్సెస్ ట్రాక్ కొనసాగుతుంది. శ్రీవిష్ణుతో భవిష్యత్తులోనూ సినిమాలు చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ నడుస్తున్నాయి. త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు.