09-11-2025 02:02:27 AM
కోళ్ల కోసం పరుగులెత్తిన జనం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన
భీమదేవరపల్లి, నవంబర్ 8 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మోడల్ స్కూల్ సమీపంలో శనివారం సుమారు రెండు వేల వరకు నాటు కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. నాటు కోళ్లను వదిలి వెళ్లినట్లు ఎల్కతుర్తి గ్రామంలో దావనంలా వ్యాపించడంతో గ్రామస్థులంతా కోళ్లను పట్టుకునేందుకు పంట పొలాల్లో పరుగులు తీశారు. కొంతమందికి ఒకటి రెండు కోళ్లు దొరకగా మరి కొంత మంది యువకులు ముందు చూపు తో ఇంటివద్ద నుంచి తెచ్చుకున్న బ్యాగులో పదుల సంఖ్యలో కోళ్లను పట్టుకెళ్లారు.
దీంతో శనివారం ఎల్కతుర్తి గ్రామం మొత్తం నాటుకోడి కూర, పులుసుతో గుమగుమ లాడింది. అయితే కోళ్లకు వైరస్ సోకడంతో వదిలి వెళ్లారని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పం చాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పలు కోళ్లను పశువైద్యాధికారిణి దీపిక వద్దకు తీసుకువెళ్లారు. కోళ్లకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవ ని పశువైద్యాధికారిణి తెలిపారు. ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వది లిపెట్టారో తెలియాల్సి ఉంది.