calender_icon.png 16 June, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదడుకు ముప్పు

08-06-2025 12:00:00 AM

మెదడులోని కణజాలాల్లో ఏర్పడే ముద్దను మెదడు కణితి అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లు శరీరంలో వివిధ భాగాల్లో సోకుతాయి.

అవి రక్తంలో ప్రవేశించి మెదడుకు చేరతాయి. దీని ద్వారా మెదడులో కణితులు ఏర్పడతాయి. కొన్ని రసాయనాల బారిన పడటం, రేడియేషన్ ఎక్కువగా ఉండటం, ఎక్స్‌టీమ్ వైరస్ బారిన పడటం వల్ల ఈ కణితులు ఏర్పడతాయి. 

ఎవరికైనా రావొచ్చు

బ్రెయిన్ ట్యూమర్లు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావొచ్చు. బ్రెయిన్‌ట్యూమర్లు పెద్దవాళ్లలో కాస్త తక్కువే అనుకోవచ్చు. మొత్తం కణితుల్లో ఇవి 1 శాతమే. కానీ పిల్లల్లో తరచూ చూస్తుంటాం. ఇవి ఎందుకు ఏర్పడతాయన్నది కచ్చితంగా తెలియదు.

కొన్నిరకాల కణితులకు ఆయా జన్యువుల్లో మార్పులు కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వంటివి అతిగా వాడటం వల్ల బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయని అనుకుంటారు ఇది నిరూపణ కాలేదని పరిశోధకులు చెబుతున్నారు. జన్యుపరమైన లోపాలు, తీసుకునే ఆహారం, స్మోకింగ్, ఆల్కాహాల్ తీసుకునే వారిలోనూ రావచ్చు.

నాలుగు దశలు.. లక్షణాలు 

బ్రెయిన్ ట్యూమర్‌కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. 

మొదటిదశ: తలనొప్పి, వాంతులు, తలతిరగడం.

రెండోదశ: తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతు లు అవడం, తలతిరగడం ఎక్కువగా ఉంటుంది. 

మూడోదశ: బ్రెయిన్‌లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. 

నాలుగోదశ:ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు. 

అన్ని కణితులూ క్యాన్సర్లు కావు

మెదడులో కణితి ఉన్నంత మాత్రాన క్యాన్సర్ కానవసరం లేదు. మామూలు కణితులూ ఉండొచ్చు. ఉదాహరణకు శ్రవణ నాడడీ మీద తలెత్తే ఎకోస్టిక్ న్యూరోమా లేదా ష్వానోమా. దీన్ని శస్త్ర చికిత్స చేసి తొలగించవచ్చు. శస్త్రచికిత్స చేయలేకపోతే స్టిరియోటాక్టిక్ రేడియేషన్ చేయొచ్చు.

పీయూష (ఫిట్యూటరీ) గ్రంథి మీద తలెత్తే మామూలు కణితులు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయొచ్చు. మెదడులో కణితులు ఉన్నచోటును బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి. కణితి మూలంగా పుర్రె లోపల ఒత్తిడి పెరుగుతుంది. 

బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలు

* మెదడులో కణితులు ఏర్పడితే అవి ముదిరిపోయే దాకా గుర్తించలేరు. 

* తరచుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. వాంతులు కూడా అవుతాయి. ఈ లక్షణాలను చాలా సాధారణమైనవని అనుకుంటారు. వైద్యుల దగ్గరకు వెళ్లకుండా మందులను మింగేస్తారు. 

* 20 ఏళ్ల వయసులో ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చినట్లయితే మెదడులో సమస్య ఉన్నట్టేనని గుర్తించాలి. 

* మాట స్పష్టత లోపించడం, ఎప్పుడూ మగతగా ఉం డటం, అన్నం మింగడంలో ఇబ్బందిగా ఉంటుంది. 

* మెదడులోని కణితులను తొలి దశలోనే గుర్తించినట్లయితే ఆధునిక వైద్యం సాయంతో వాటిని తొలగించడానికి వీలవుతుంది. 

* జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చదవడం, రాయడంలో ఇబ్బంది, చేతి వణుకు, రుచి, వాసన, వినగల సామర్థ్యం తగ్గడం, చేయి, ముఖం లేదా కాళ్ల కండరాలు బలహీనపడటం.

బయాప్సీతో నిర్ధారణ

క్యాన్సర్‌ను అనుమానిస్తే ఎంఆర్‌ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఒక్క కణితులతోనే కాదు.. మెదడులో క్షయ, ఇతర ఇన్‌ఫెక్షన్లతోనూ ఫిట్స్ రావచ్చు. రక్తనాళం చిట్లి రక్తం గడ్డ కట్టినా ఫిట్స్ రావొచ్చు. ఇలాంటి సమస్యలేవైనా ఉ న్నాయేమో తెలుసుకోవడానికి ఎంఆర్‌ఐ విత్ స్పెక్ట్రోస్కో పీ చేస్తారు. దీంతో కణితి క్యాన్సరా? కదా? అన్నది బయటపడుతుంది.

క్యాన్సర్‌ను అనుమానిస్తే కణితి నుంచి చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు (బయాప్సీ). క్యాన్సర్ ఉంటే నిర్ధారణ అవుతుంది. కణితి చాలా లోతులో ఉంటే (బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాల వంటివి) బయాప్సీ చేయడం కుదరదు. బయాప్సీ చేస్తే ప్రాణాపాయానికి దారితీయొచ్చు. వీటిని ప్రత్యేక కణితులుగా భావించి.. ఎంఆర్‌ఐ ఫలితాలను బట్టే చికిత్సను నిర్ణయిస్తారు. 

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే

జూన్ 8.. ఈ రోజు ప్రతి ఏటా ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేగా నిర్వహిస్తారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం. మానవ శరీరంలో మెదడు కీలక అవయవం. శరీర నిర్మాణం, వ్యవహారం మొత్తం నడిచేది అక్కడి నుంచే.

అలాంటి మెదడులో అలజడి రేగితే శరీరం మొత్తం స్తంభించి పోతుంది. ఇక మెదడులో వచ్చే కణితులు ఇంకా ప్రమాదం. ఈ సమస్య పట్ల జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం. ఈ సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స విధానాల గురించి ప్రత్యేక కథనం..  

చికిత్స 

బ్రెయిన్ ట్యూమర్ దశను బట్టి చికిత్స అందిస్తారు. శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్‌ను తొలగిస్తారు. రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్స, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి.

బ్రెయిన్ ట్యూమర్‌కు ప్రధానంగా కీమోథెరపీని, రేడియేషన్ థెరపీతో కలిపి శస్త్రచికిత్స చేస్తారు. అలాగే పోస్ట్ న్యూరో సర్జరీ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఫిజికల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ కూడా ముఖ్యమైనవి. చికిత్స అనేది కణతి రకం, రోగి సాధారణ ఆరోగ్యం, కణ తి స్థానం, ట్యూ మర్ పరిమాణంపై కూడా ఆధారపడి ఉంటుంది.