31-07-2025 12:08:51 AM
మైనంపల్లి అనుచరుల పనే అని బిఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు
మేడ్చల్, జూలై 30(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎవరు కాల్స్ చేసి ఉంటారనే దానిపై పలువురు పలు విధాలుగా చర్చిస్తున్నారు. బెదిరింపు కాల్స్ విషయమై బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ అనుచరులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
మైనంపల్లి హనుమంతరావుకు, శంబీపూర్ రాజుకు మధ్య వైరుధ్యం ఉన్నట్టు ఇప్పటివరకు బయటపడలేదు. ఎప్పుడు ఒకరినొకరు విమర్శించుకున్న దాఖలాలు లేవు. గతంలో మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎస్ లో ఉన్న సమయంలో స్నేహంగా ఉన్నారు. ప్రస్తుతం వేరువేరు పార్టీలో ఉన్నప్పటికీ విమర్శించుకోలేదు. ఇటీవల మల్కాజిగిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర గొడవ జరిగింది. బీఆర్‌ఎస్ నాయకులకు దెబ్బలు తగిలాయి. మాజీ మంత్రి కేటీఆర్ వచ్చి గాయపడిన వారిని పరామర్శించారు.
ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పరామర్శించారు. శంబిపూర్ రాజు ఈ వివాదంలో తల దూర్చలేదు. కేటీఆర్ వచ్చిన సమయంలో మాత్రమే వచ్చారు. మైనంపల్లి హనుమంతరావు వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించకపోవడం గాక, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడిగా విమర్శించిన దాఖలాలు కూడా లేవు. మైనంపల్లికి జిల్లాలో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ఎవరితోనూ శత్రుత్వం లేదు. మేడ్చల్, మల్కాజిగిరి ఎమ్మెల్యే లు చామకూర మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి తో మాత్రమే వైరుధ్యం ఉంది. శంబిపూర్ రాజుకు వచ్చిన బెదిరింపు కాల్స్ ఎవరివి అనేది చర్చ జరుగుతోంది. బి ఆర్ ఎస్ నాయకులు అనుమానం వ్యక్తం చేసినట్లు మైనంపల్లి అనుచరులే బెదిరింపు కాల్స్ చేశారా? ఇంకెవరైనా చేశారా? అనేది విచారణలో తేలనుంది. హనుమంతరావు ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు.
సీపీకి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు : ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుకు చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ రావ్ అనుచరులే చేస్తున్నారని అను మానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మధుసూదనా చారి, దాసోజు శ్రవణ్ కుమార్, శంబిపూర్ రాజు, డాక్టర్ సంజయ్, లక్ష్మారెడ్డి తదితరులుఉన్నారు.