సంధ్య థియేటర్ ఘటనలో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపిన ప్రకారం ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ వద్ద భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే హీరో అల్లు అర్జున్, పుష్ప టీం చేరుకోవడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.ఘటనలో అంబర్‌పేటకు చెందిన రేవతి (35) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ (13) పరిస్థితి ప్రమాదకరంగా ఉండి, చికిత్స పొందుతున్నాడు.
నటీనటుల బృందం థియేటర్‌కు వస్తారనే విషయం థియేటర్ యాజమాన్యానికి తెలిసినప్పటికీ, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని పోలీసులు తప్పుబట్టారు. ఘటనపై చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ బీ రాజునాయక్, చిక్కడపల్లి అడిషనల్ ఇన్‌స్పెక్టర్ శేఖర్ కేసును దర్యాప్తు చేసి ఈ తోపులాట నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టనందున థియేటర్ యాజమాన్యంపై బీఎన్‌ఎస్ 105, 118(1), ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఘటనకు బాధ్యులైన సంధ్య 70 ఎంఎం థియేటర్ పార్టనర్ ఎం సందీప్, మేనేజర్ నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జి గంధకం విజయ్ కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.






